మనసు మురిసెను ఇలా..

మనసు మురిసెను ఇలా..

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకుడు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలతో ఇంప్రెస్ చేసిన మేకర్స్, సోమవారం మూడో పాటను విడుదల చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. ‘మధురము కదా..  ప్రతి ఒక నడక నీతో కలిసి ఇలా, తరగని కథ మనది కనుక.. మనసు మురిసెను ఇలా.., ఉసురేమో నాదైనా,  కసురైన విసురైన విసుగైన రాదుగా.. అంటూ శ్రీమణి క్యాచీ లిరిక్స్ రాశాడు. ఓ గేటెడ్ కమ్యూనిటీలో హోలీ వేడుకల మధ్య ఈ పాటను లాంచ్ చేశారు.

వేదికపై హోలీ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ విజయ్, మృణాల్‌‌‌‌‌‌‌‌ సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘నేను చదువుకునే రోజుల్లో హోలీ రంగులు అని భయపడి ఇంట్లోనే ఉండేవాడిని. కానీ ఇప్పుడు అందరితో హోలీ జరుపుకుంటుంటే పండుగంటే ఇలా ఉండాలని అనిపిస్తోంది. మన లాంటి కుటుంబాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి కథ ఇది. ఫ్యామిలీ గురించి ఆలోచించే వారి కథ. థియేటర్స్‌ లో సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.

ప్రతి ఏడాది ముంబైలో హోలీ చేసుకునే నేను, ఈసారి ‘ఫ్యామిలీ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ టీమ్‌‌‌‌‌‌‌‌తో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని మృణాల్ చెప్పింది. దిల్ రాజు మాట్లాడుతూ ‘తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. ఇదొక మిడిల్‌‌‌‌‌‌‌‌ క్లాస్ స్టోరీ. మధ్యతరగతి ఎమోషన్స్ అన్నీ విజయ్‌‌‌‌‌‌‌‌ పాత్రలో  కనిపిస్తాయి. ప్రేక్షకులు తమను తాము తెరపై చూసుకుంటున్నట్టుగా ఉంటుంది’ అన్నారు.