’స్వచ్ఛ’ దూతగా విజయ్​ దేవరకొండ

’స్వచ్ఛ’ దూతగా విజయ్​ దేవరకొండ

హైదరాబాద్, వెలుగు:  స్వచ్ఛ కార్యక్రమాలపై నగరవాసుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ముందుకు వచ్చారని బల్దియా కమిషనర్​ దానకిశోర్ వెల్లడించారు. నగర వాసులను చైతన్యపర్చేందుకు ప్రత్యేకంగా 2 వేల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లను నియమిస్తున్నట్టు ఆయన తెలిపారు. సాఫ్, షాన్ దార్ హైదరాబాద్ కార్యక్రమం, వాక్ నిర్వహణపై జీహెచ్‌‌ఎంసీ, యూసీడీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జలమండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రస్తుతం రోజుకు 4,700లకు పైగా మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని, దీనిని కనీసం సగానికి తగ్గించేందుకు సేంద్రియ ఎరువుల తయారీ, తడి, పొడి చెత్త వేరు చేయడం, చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించడం తదితర కార్యక్రమాల పట్ల నగరవాసులను చైతన్యం చేయాలన్నారు. దీనికి ప్రత్యేకంగా 2 వేల మంది సి.ఆర్.పి లను నియమించడానికి అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. నగరంలో 1,090 స్లమ్ లెవల్ ఫెడరేషన్లు ఉన్నాయని, ఈ ఎస్.ఎల్.ఎఫ్ ప్రతినిధుల ద్వారా నగర సమస్యలను సేకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను జిహెచ్ఎంసి, జలమండలిలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, సిక్తా పట్నాయక్, జలమండలి ఈడీ సూర్యనారాయణ పాల్గొన్నారు.

గ్రేటర్ మొత్తానికి సాఫ్,  షాన్ దార్ హైదరాబాద్ విస్తరణ

నగరంలో గత మూడు నెలలుగా 150 డివిజన్లలో నిర్థారించిన ప్రత్యేక లొకేషన్లలో నిర్వహిస్తున్న సాఫ్ హైదరాబాద్ షాన్ దార్ హైదరాబాద్ కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నందున ఈ కార్యక్రమాన్ని నగరం మొత్తానికి విస్తరిస్తున్నట్టు కమిషనర్ దానకిశోర్ ప్రకటించారు. సాఫ్ హైదరాబాద్ షాన్ దార్ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహణపై జరిగిన జీహెచ్​ఎంసీ సర్వసభ్య సమావేశంలో కూడా పలువురు ప్రజాప్రతినిధులు ప్రశంసించారని, ఈ కార్యక్రమాన్ని అన్ని వార్డుల్లో చేపట్టాలని కార్పొరేటర్లు కోరుతున్నందున మొత్తం హైదరాబాద్ కు విస్తరిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సాఫ్, షాన్ దార్ హైదరాబాద్ ను మరో సంవత్సరం వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియమించిన స్వచ్ఛంద సంస్థలు, స్థానిక స్వయం సహాయక మహిళా బృందాలతో సమన్వయంతో కలిసి స్వచ్ఛ కార్యక్రమాలు, నీటి వృథాను తగ్గించడానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజు పది శాతం నీరు అంటే 16 కోట్ల లీటర్ల నీరు వృథాగా పోతుందని, ఈ నీటి వృథాను తగ్గించేందుకు, రోజుకు 25 కిలోల చెత్తను ఉత్పత్తి చేసే వారిని బల్క్ గార్బేజ్ ప్రొడ్యూసర్లుగా ప్రకటించనున్నామని తెలిపారు. నగరంలో స్వచ్ఛ ఆటోలను స్వయం సహాయక మహిళా బృందాల ద్వారా కొనుగోలు చేయించి వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ లో స్వచ్ఛ ఉల్లంఘనులను గుర్తించి వారికి గత రెండు నెలల్లో రికార్డు స్థాయిలో కోటి రూపాయలకు పైగా జరిమానాలు విధించామని పేర్కొన్నారు.

గచ్చిబౌలి, వెలుగు: జాతీయ రహదారి 44 వెంట ఉన్న ఫంక్షన్​ హాల్స్​ నిర్వాహకులు  ఈవెంట్స్​ ఉన్నప్పుడు ట్రాఫిక్​​ రూల్స్​ పాటించాలని, సరైన పార్కింగ్​ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలని సైబరాబాద్​ ట్రాఫిక్​ డీసీపీ విజయ్​కుమార్​ సూచించారు. శుక్రవారం కమిషనరేట్​ కార్యాలయంలో ఎన్​హెచ్​44 వెంట రాజేంద్రనగర్​ నుండి శంషాబాద్​ వరకు ఉన్న 23 ఫంక్షన్​ హాల్స్​ యజమానులతో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంట ఉన్న ఫంక్షన్​ హాల్స్​లలో మేజర్​ ఈవెంట్స్​ ఉన్న సమయంలో వాహనాలు జాతీయ రహదారి వెంట పార్కింగ్​ చేస్తున్నారని..ఇలా  చేయడం వల్ల ఎయిర్​ పోర్టుకు, బెంగుళూరుకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నిర్వాహకులు సరైన పార్కింగ్​ స్థలాన్ని, అంతర్గత రోడ్లను ఏర్పాటు చేసుకొని రోడ్లపై వాహనాలను నిలపకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.