నేతలను ఎన్నుకోవడంలో మిడిల్ క్లాస్ వాళ్లే సమర్థులు

నేతలను ఎన్నుకోవడంలో మిడిల్ క్లాస్ వాళ్లే సమర్థులు

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రజాస్వామ్య విధానంపై ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. దీంట్లో భాగంగా విజయ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో నేతలను ఎన్నుకునే సమయంలో ప్రతి ఒక్కరికీ ఓటు వేయడానికి అనుమతించొద్దన్నాడు. తనకు రాజకీయాలను పట్టించుకునే ఆసక్తి, ఓపిక లేవన్నాడు.

‘నాకు రాజకీయాలపై ఓపిక లేదు. రాజకీయ వ్యవస్థ ఒకరకంగా అర్థవంతంగా లేదనే చెప్పాలి. అదే సమయంలో మనం ఎన్నికలకు వెళ్లే పద్ధతి కూడా సరిగ్గా లేదు. ప్రతి ఒక్కరినీ ఓటు వేయడానికి అనుమతించొద్దనేది నా ఆలోచన. మనం విమానం ఎక్కి బాంబేకు వెళ్తున్నామనుకోండి. ఆ ఫ్లయిట్‌‌‌లో ఎవరు ప్రయాణించాలనేది మనందరం నిర్ణయిస్తామా? అదే విధంగా ఓ విమానంలో 300 మంది ప్రజలు ఉన్నారనుకోండి.. ఎవరు ఫ్లయిట్‌‌లో వెళ్లాలనేది వారిలో ఎవరు నిర్ణయిస్తారు? వాళ్లు కాదు కదా. అందుకే మనం సమర్థవంతమైన ఎయిర్‌‌లైన్స్ ఏజెన్సీలను ఏర్పాటు చేసుకున్నాం. విమానాల్లో ఎవరు ప్రయాణించాలో వారే నిర్ణయిస్తారు. అదే విధంగా సమాజంలో మిడిల్ క్లాస్‌‌కు చెందిన ప్రజలు తమ నాయకుడ్ని ఎన్నుకోవడానికి అత్యంత సమర్థులు. అందుకే ఓటు వేసే గౌరవం కేవలం వారికే ఇవ్వాలి’ అని ప్రేక్షకులు ముద్దుగా రౌడీ అని పిలుచుకునే విజయ్ దేవరకొండ చెప్పాడు.