Thalapathy Vijay: నన్ను తొక్కేయాలని చూస్తున్నారు.. నాకు న్యాయం కావాలి.. దళపతి ఎమోషనల్ డిమాండ్

Thalapathy Vijay: నన్ను తొక్కేయాలని చూస్తున్నారు.. నాకు న్యాయం కావాలి.. దళపతి ఎమోషనల్ డిమాండ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరు రోజురోజుకీ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ప్రధాన పార్టీలైన టీవీకే, డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల నేతలు వరుస ర్యాలీలు, సభలతో ఎన్నికల వేడిని పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళపతి విజయ్ తనదైన స్పీచ్ లతో ముందుకెళ్తున్నారు.

ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, గురువారం (ఏప్రిల్ 2) విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా, గత కొంతకాలంగా తనపై జరుగుతున్న “కుట్రలు”పై విజయ్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, రాజకీయ ప్రత్యర్థులు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.

కరూర్ ఘటనపై వివాదం

గత సంవత్సరం 2025 సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతుండగా, విజయ్‌ను ఇప్పటికే రెండు సార్లు విచారణకు పిలిచింది. ఈ సంఘటన వెనుక కూడా “కుట్రలు ఉన్నాయి” అని ఆయన ఆరోపించారు.

‘జననాయగన్’ విడుదలకు అడ్డంకులు

విజయ్ చివరి సినిమా ‘జననాయగన్’ విడుదల కూడా ఆలస్యమవుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ బోర్డు (CBFC) వద్ద నిలిచిపోయింది. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు, సైన్యానికి సంబంధించిన సూచనలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవడంతో మరింత పరిశీలన అవసరమని సూచించారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ పార్టీ  ప్రభుత్వం “బ్లేమ్ గేమ్” ఆడుతున్నారని విజయ్ విమర్శించారు.

నాకు న్యాయం కావాలి:

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జరిగిన ర్యాలీలో విజయ్ మాట్లాడుతూ.. “మీ విజయ్‌ను వ్యతిరేకించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయి. కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక, అలాగే నా లాస్ట్ మూవీ జన నాయగన్ విడుదలకు అడ్డంకులు సృష్టించడంలో ఒక పెద్ద కుట్ర దాగి ఉంది.

ఆ సినిమా విడుదలైతే మన మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుందని, అది ఎన్నికల్లో ప్రభావవంతమైన శక్తిగా మారుతుందని భావించి దాన్ని అడ్డుకున్నారు. వారు నన్ను మోసం చేశారు. మీ సోదరుడిగా, మీ కుమారుడిగా నేను మీ ముందుకు వచ్చి న్యాయం కోరుతున్నాను,” అని విజయ్ ఎమోషనల్ అయ్యారు. 

అలాగే, విజయ్ గత ప్రసంగాల్లో చెప్పిన విషయాన్నే మళ్లీ స్పష్టం చేశారు. తాను విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రజల కోసం ముందుకు వచ్చానని పేర్కొన్నారు. “నాకు విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ, మీ కోసం ఇక్కడికి వచ్చాను. మీరు ఇచ్చిన ప్రేమకు ప్రతిఫలంగా, మీ కోసం అన్ని కష్టాలు భరించేందుకు సిద్ధంగా ఉన్నాను.

నేను ఎప్పుడూ మీతో అబద్ధం చెప్పను, మోసం చేయను. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి M. K. స్టాలిన్ కావాలా, లేక ప్రజల కోసం పనిచేసే విజయ్ కావాలా అన్నదే ఈ ఎన్నికల సారాంశం” అని విజయ్ తెలిపారు.

‘కరూర్’ ఘటన నుంచి ‘జననాయగన్’ వరకు.. ఇలా నా ప్రతి అంశంలో నా మీద పెద్ద కుట్ర జరుగుతోంది. మీ కోసం న్యాయం కోరడానికి వచ్చిన నాకు కూడా న్యాయం కావాలి అని విజయ్ తన స్పీచ్ ముగించారు. తన ప్రసంగంలో డీఎంకేను ‘రాజకీయ శత్రువు’గా అభివర్ణిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఓటర్లను కోరారు.

‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ గురించి:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీ నటుడు విజయ్ జోసెఫ్ తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 234 స్థానాలకు టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్.. ఈ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నాడు. టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని ఇప్పటికే విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

యువకుల్లో విజయ్ టీవీకే పార్టీకి మంచి క్రేజ్ ఉంది.18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లలో మెజారిటీ ఓట్లు విజయ్ వైపు మళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా చెన్నై, మదురై, తిరుప్పూర్ వంటి నగరాల్లో టీవీకే  బలంగా పుంజుకుంటోంది. చెన్నైలోని కొన్ని నియోజకవర్గాల్లో రెండో అతిపెద్ద  పార్టీగా ఎదిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. 

దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయం డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతోంది.  అయితే,  ప్రస్తుతం ప్రజల్లో ఒక కొత్తమార్పు కోసం తపన కనిపిస్తోంది.  ముఖ్యంగా యువత,  తొలిసారి ఓటువేసే ఓటర్లు విజయ్ వైపు  మొగ్గు చూపుతున్నారు.

విజయ్ తన ప్రసంగాల్లో అటు డీఎంకేను ‘రాజకీయ శత్రువు’గా,  ఇటు బీజేపీని ‘సైద్ధాంతిక శత్రువు’గా పేర్కొంటూ తనదైన మార్కు చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన, పెరియార్, అంబేద్కర్ ఆశయాలే  తన బాట అని స్పష్టం చేయడం ద్వారా ద్రవిడ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకుంటూనే  కొత్తదనం చూపిస్తున్నారు.