
సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా.. విజయ్ సేతుపతి నటిస్తున్నాడంటే దాని రేంజే మారిపోతుంది. తనదైన నటనతో మెస్మరేజ్ చేసేస్తాడు. ఇక మేకోవర్ విషయంలోనూ మనసులు దోచుకుంటాడు. ఒకేసారి నాలుగు సినిమాలు వస్తే ఒక్కోదానిలో ఒక్కోలా కనిపిస్తాడు. క్షణాల్లో ఆ పాత్రకి తగ్గట్టు మారిపోవడం, ఆ పాత్రకి తానే పర్‌ఫెక్ట్ అన్నంత గొప్పగా నటించడం ఆయన్ని చూసే నేర్చుకోవాలి.
ప్రస్తుతం సేతుపతి చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిలో వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్న ‘విడుదలై’ ఒకటి. సూరి మరో లీడ్ రోల్ చేస్తున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం కొడైకెనాల్‌లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీలో యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. లొకేషన్ నుంచి సేతుపతి స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో మధ్య వయస్కుడైన పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్నాడు తను.
కాస్త రా అండ్ రగ్డ్‌గానూ ఉన్నాడు. ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎల్‌రెడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.