కేసీఆర్​ కాళ్ల దగ్గర బీజేపీ..అవినీతిపై మోదీ ఎందుకు చర్యలు తీసుకుంటలే : విజయశాంతి

కేసీఆర్​ కాళ్ల దగ్గర బీజేపీ..అవినీతిపై మోదీ ఎందుకు చర్యలు తీసుకుంటలే : విజయశాంతి
  • బీఆర్​ఎస్​, బీజేపీ మధ్య తెరచాటు ఒప్పందం : విజయశాంతి
  • ఏ శత్రువుతో పోరాడుతున్నామో వారితోనే  చేతులు కలిపారు
  • బీజేపీ వాళ్లే పార్టీని పాతాళంలోకి తీసుకెళ్లారని కామెంట్​

హైదరాబాద్, వెలుగు : ఏ శత్రువుతోనైతే తాను పోరాడుతున్నానో ఆ శత్రువుతోనే బీజేపీ చేతులు కలిపిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ​నేత విజయశాంతి ఆరోపించారు. ప్రధాని మోదీ బీజేపీని కేసీఆర్​ కాళ్ల దగ్గర పెట్టారని ఆమె మండిపడ్డారు. కేసీఆర్​ అవినీతిపై ఆధారాలున్నాయని పదే పదే చెప్తున్న మోదీ, అమిత్​ షా, జేపీ నడ్డా.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్​ఎస్​ మధ్య తెరచాటు ఒప్పందం ఉందని ఆరోపించారు. 

శనివారం కాంగ్రెస్​ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో కలిసి విజయశాంతి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ అనే అవినీతిపరుడిని లోపల వేస్తం.. అలాంటి నేత ఉండకూడదని బీజేపీ నేతలు మాటలు చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉన్నందున చర్యలు తీసుకుంటుందని ఉద్యమకారులమంతా బీజేపీలో చేరాం. రోజులు గడిచాయి.. నెలలు గడిచాయి.. సంవత్సరాలు దాటాయి.. అయినా చర్యలు మాత్రం శూన్యం. కేసీఆర్​ అవినీతిపై స్పష్టమైన ఆధారాలున్నప్పుడు.. కేంద్రంలో అధికారంలో ఉండి చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు?’’ అని మోదీని ప్రశ్నించారు. కాళేశ్వరం మునిగినా, మేడిగడ్డ కుంగినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్​ అవినీతిపై చర్యలు తీసుకుంటామంటేనే తన లాంటి ఉద్యమకారులు బీజేపీలో చేరారని, కానీ, తమను పిచ్చోళ్లను చేశారని విజయశాంతి మండిపడ్డారు. తెరచాటు ఒప్పందాలతో బీజేపీ కార్యకర్తలను పిచ్చోళ్లను చేశారన్నారు. కేసీఆర్​పై చర్యలు తీసుకుంటారని చివరి నిమిషం వరకు వేచి చూశానని, కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ వస్తే ఇదే విషయంపై కలిసినట్టు చెప్పారు. కేసీఆర్​పై చర్యల గురించి మాట్లాడతారనుకుంటే.. ఏదీ లేదన్నారు.

అందుకే బీజేపీని వీడి కాంగ్రెస్​లోకి వచ్చానన్నారు. కేసీఆర్​ను గద్దె దింపడమే తమ లక్ష్యమన్నారు. చెడును సంహరించేందుకు అమ్మవారు ఎన్నో అవతారాలు ఎత్తారని, మారుతున్న రాజకీయ పరిణామాలకు తగినట్టు చెడును ఎదుర్కొనేందుకు ఉద్యమకారిణిగా తన స్ట్రాటజీని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

బీజేపీలో కేసీఆర్​ మొక్క

ఎన్నికలకు మరో నాలుగు నెలలు ఉందనగా బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్​ను తొలగించారని, దానిని తాను తీవ్రంగా వ్యతిరేకించానని విజయశాంతి చెప్పారు. ఆ నిర్ణయం వల్ల పార్టీ దెబ్బతింటుందని చెప్పానన్నారు. బీజేపీలో కేసీఆర్​ ఒక నాయకుడిని మొక్కలా నాటారని ఆరోపించారు. ఆ నాయకుడే బీజేపీ అధ్యక్షుడిని మార్చాలంటూ పదే పదే చెప్పారని తెలిపారు. ఆయన డిమాండ్​కు తలొగ్గిన హైకమాండ్​.. సంజయ్ ని మార్చిందన్నారు. ఆ వ్యక్తిపై నమోదైన అసైన్డ్​ భూముల కేసు ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీని ఆ పార్టీవాళ్లే తమ చేజేతులా నాశనం చేసుకున్నారని, పార్టీని పాతాళంలోకి నెట్టేశారని మండిపడ్డారు.

తనను తిట్టే హక్కు బీజేపీ, బీఆర్​ఎస్​ నేతలకు లేదని చెప్పారు. కేసీఆర్​ ఇచ్చే డబ్బులకు లొంగే వ్యక్తిని తాను కాదన్నారు. తన గురువు అద్వానీ అని, రాజకీయాల్లో సభ్యత, సంస్కారం నేర్పారని చెప్పారు. కానీ, ఇప్పుడు బీజేపీ లీడర్లకు ఆ సభ్యత, సంస్కారమే లేవన్నారు. కేసీఆర్​ను తాను దేవుడిచ్చిన అన్న అని అనలేదని, ఆయనే తనను దేవుడిచ్చిన చెల్లిగా చెప్పుకున్నారన్నారు. ప్రస్తుతం తాను కార్తీక మాసం దీక్షలో ఉన్నానని, ఆ శివయ్య ఆశీస్సులతో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ క్యాంపెయిన్‌‌ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్‌‌‌‌గా  విజయశాంతి

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్‌‌‌‌గా మాజీ ఎంపీ విజయశాంతిని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నియమించారు. ఆమెతో పాటు మరో 15 మందిని కన్వీనర్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. కన్వీనర్లుగా మాజీ మంత్రులు డీకే సమరసింహారెడ్డి, పుష్పలీల, మాజీ ఎంపీ మల్లు రవి

మాజీ ఎమ్మెల్యేలు ఎం.కోదండరెడ్డి, వేం నరేందర్‌‌‌‌ రెడ్డి, ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, పోట్ల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు ఒబేదుల్లా కోత్వాల్, రమేశ్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్ధేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జైన్లను నియమించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని వేణుగోపాల్ స్పష్టం చేశారు.