వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ధన్నారం గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మద్యం అమ్మకాలతో యువత పక్కదారి పడుతుండడం, మత్తు పదార్థాలకు బానిసై కొందరు ప్రాణాలు కోల్పోవడంతో ఆదివారం గ్రామసభ నిర్వహించారు. సోమవారం నుంచి ధన్నారం గ్రామంలో మద్యం, గుట్కా, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు, కొనుగోళ్లు, సేవించడం పూర్తిగా నిషేధించారు. గ్రామ తీర్మానాన్ని ఉల్లంఘించి ఎవరైనా మద్యం అమ్మితే రూ.5 లక్షల జరిమానా, మద్యం కొనుగోలు చేసిన వారికి రూ.2 లక్షల జరిమానా విధించాలని గ్రామంలోని మహిళ, యువజన సంఘాలు, రైతులు, పెద్దలు సంతకాలు చేసి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానం అమలు చేసేందుకు గ్రామ పెద్దలతో మద్య నిషేధ అమలు కమిటీని ఏర్పాటు చేశారు. 24 గంటల నిఘా పెట్టాలని నిర్ణయించారు. గ్రామ యువతను, ఊరిని కాపాడుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో మద్యం అరికట్టేందుకు ఎక్సైజ్, పోలీస్ అధికారులు సహకరించాలని వారు కోరారు. మున్సిపల్ రెండో వార్డు కౌన్సిలర్ సుధాకర్, కాంగ్రెస్ నాయకులు సంగని జంగయ్య, నాయకులు ఆనంద్, రాకేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
