ఎన్నికల వేళ బీజేపీకి షాక్..పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత

ఎన్నికల వేళ బీజేపీకి షాక్..పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత

లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నా విక్రమ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టిక్కెట్ ఆశించారు. కానీ అధిష్టానం ఆయనకు మొండి చెయ్యి చూపడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విక్రమ్ గౌడ్ కు నచ్చజెప్పారు. 

  తదుపరి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారని విక్రమ్ గౌడ్ ఆశించారు. కానీ పార్టీ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో బీజేపీని వీడాలని డిసైడ్ అయ్యారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలోనే విక్రమ్ గౌడ్ తన సొంతగూటికి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం.  

పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విక్రమ్ గౌడ్ లేఖలో తెలిపారు. ఏదో ఒక గ్రూప్ రాజకీయాలలో ఉంటేనే పార్టీలో మనుగడ ఉంటుందని అన్నారు.  పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదన్నారు.  ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పని చేయాలని ఆదేశిస్తున్నారని విక్రమ్ గౌడ్ చెప్పారు.