ఆగస్టు 23న సాయంత్రం మన విక్రమ్ ల్యాండింగ్

ఆగస్టు 23న సాయంత్రం మన విక్రమ్ ల్యాండింగ్

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్  ల్యాండర్  మాడ్యూల్(ఎల్ఎం).. జాబిల్లికి చేరువైంది. ల్యాండర్  ‘విక్రమ్’  ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై దిగే అవకాశం ఉందని ఇస్రో వెల్లడించింది. ల్యాండర్  మాడ్యూల్  కక్ష్యను విజయవంతంగా తగ్గించామని ఆదివారం ట్వీట్​ చేసింది. మాడ్యూల్ సాఫ్ట్ గా ల్యాండ్  అయ్యేందుకు ఇంటర్నల్  చెకింగ్స్  చేస్తామని పేర్కొంది. అయితే, ఎల్ఎం ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు జాబిల్లిపై దిగవచ్చని ఇస్రో ఇంతకుముందు తెలిపింది. 

ప్రస్తుతం ఆ టైమ్ ను 17 నిమిషాలు ముందుకు జరిపింది. సెకండ్, ఫైనల్ డీబూస్టింగ్​తో ఎల్ఎం కక్ష్యను సైంటిస్టులు తగ్గించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా ఇండియా రికార్డు సృష్టిస్తుంది. జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే క్షణం కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

దీంతో ల్యాండింగ్​ను ఈ నెల 23న సాయంత్రం 5.27 గంటల నుంచి దూరదర్శన్​లో ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. దీంతో పాటు ఇస్రోకు చెందిన వెబ్ సైట్, యూట్యూబ్  చానెల్, ఫేస్ బుక్  పేజీల్లోనూ చంద్రయాన్ 3 ల్యాండింగ్  దృశ్యాలను లైవ్ లో చూపుతారు. ‘‘చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండ్  కావాలని అందరూ కోరుకుంటున్నారు. దేశ చరిత్రలోనే ఇదో కీలకమైన ఘట్టం. ఈ మిషన్  సక్సెస్  అయితే, స్పేస్ సైన్స్ రంగంపై దేశ యువత కచ్చితంగా మరింత ఆసక్తి చూపుతుంది. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశ సత్తా ప్రపంచానికి మరోసారి తెలుస్తుంది” అని ఇస్రో తెలిపింది.