- పల్లెపోరు షురూ
- షెడ్యూలు విడుదలతో గ్రామాల్లో ఎన్నికల వేడి
- గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు
- మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
గద్వాల, వెలుగు: గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకు ముందే గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను రిలీజ్ చేయగా ఇటీవల రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. వార్డుల వారీగా బలాబలాలు లెక్క వేసుకుంటూ వార్డు సభ్యులుగా ఎవరుంటే తమ పార్టీకి సంబంధించిన సర్పంచ్ కాండిడెట్ గెలిచే అవకాశం ఉంటుందో అంచనా వేసుకుంటున్నారు.
గ్రామాలలో టీ స్టాల్స్, రచ్చబండలు, హోటల్స్ వంటి చోట్ల సర్పంచ్ ఎన్నికలపైనే చర్చ జరుగుతున్నది. తమ గ్రామాలు రిజర్వేషన్లు ఏ కులానికి అయ్యాయి. ఎవరు నిలబడితే గెలుస్తారు..? ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి..? ఎవర్ని గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తారు అన్న అంశాలను ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఎత్తులకు పై ఎత్తులు
సర్పంచ్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రధాన పార్టీలు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. వివిధ సమీకరణాలకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించాయి. రిజర్వేషన్ ఆధారంగా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి బలమైన వ్యక్తులను గుర్తించి తమ పార్టీ మద్దతు ఇప్పిస్తామంటూ లోకల్ లీడర్లు సంప్రదింపులు చేస్తున్నారు. అవసరమైతే పెద్దలీడర్లతో కూడా మాట్లాడిస్తున్నట్టు సమాచారం. ఆర్థిక, అంగ బలాలున్న వారి వెంట పార్టీల నేతలు తిరుగుతున్నారు.
కొన్ని చోట్ల చాలాకాలంగా పార్టీలో క్రియాశీలంగా ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని మండల స్థాయి నేతలు భావిస్తున్నారు. దీనివల్ల గ్రామస్థాయిలో పార్టీ పునాదులు పటిష్టంగా ఉంటాయని వారు వాదిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గెలుపు అవకాశాలే ప్రాతిపదికగా అభ్యర్థులను ఖరారు చేయనున్నాయి.
గ్రామాల్లో మహిళా ఓటర్లే కీలకం
గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలో మొత్తం 3, 93,418 మంది ఓటర్లుండగా.. మహిళా ఓటర్లు 1,99,780 మంది, పురుష ఓటర్లు 1,93,627 మంది ఉన్నారు. 10 మంది ఇతరులున్నారు. మహిళాఓటర్లు ఎక్కువగా ఉండడంతోపాటు దాదాపు సగం సీట్లు వారికే కేటాయంచడంతో మహిళలకు ఎక్కువ మంది పోటీలో ఉండనున్నారు.
మూడు విడతల్లో ఎన్నికలు
పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామపంచాయతీలుండగా మొదటి ఫేజ్ లో గద్వాల, గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాలలోని 106 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. రెండో ఫేజ్ లో ఐజ, మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి మండలాలలోని 74 గ్రామపంచాయతీలకు, మూడో ఫేజ్ లో ఇటిక్యాల, ఎర్రవల్లి, ఆలంపూరు, మానవపాడు, ఉండవెల్లి మండలాలలోని 75 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
నారాయణపేట జిల్లాలో మొదటి విడతలో గుండు మాల్, కోస్గి, కొత్తపల్లి, మద్దూరు మండలాల్లోని 67 పంచాయతీలకు, రెండో విడతలో దామరగిద్ద, నారాయణపేట, మరికల్, ధన్వాడ మండలాల్లోని 88 పంచాయతీలకు, మూడో విడతలో నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణ, ఊట్కూరు మండలాల్లోని 110 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
మహబూబ్నగర్ జిల్లాలో మొదటి విడతలో గండేడు, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్ నగర్ మండలాల్లోని 139 పంచాయతీలకు, రెండో విడతలో అన్వాడ, చిన్న చింతకుంట, దేవరకద్ర, కోయిలకొండ, కౌకుంట, మిడ్జిల్ మండలాల్లో 151 పంచాయతీలకు, మూడో విడతలో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, బాలానగర్, జడ్చర్ల మండలాల్లోని 133 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో కల్వకుర్తి, ఊరుకొండ, వెల్దండ, .వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లోని 151 పంచాయతీలకు రెండవ విడతలో పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెళ్లి, కొల్లాపూర్, తిమ్మాజీపేట, బిజినేపల్లి, నాగర్ కర్నూల్ మండలాల్లోని 151 పంచాయితీలకు, మూడవ విడతలో చారకొండ, ఉప్పునుంతల, అచ్చంపేట, లింగాల, పదర, బల్మూర్, అమ్రాబాద్ మండలాల్లోని 158 పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి.
వనపర్తి జిల్లాలో 268 గ్రామపంచాయతీలుండగా, మొదటి ఫేజ్లో ఖిల్లాగణపురం, పెద్దమందడి, రేవల్లి, గోపాల్పేట, ఏదుల మండలాల్లోని 87 జీపీలకు, రెండవ విడతలో ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట, మదనాపురం, వనపర్తి మండల్లాలోని 94 జీపీలకు, మూడో ఫేజ్లో చిన్నంబావి, పాన్గల్, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లోని 87 జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
