పొలాల్లో రాళ్లు పడితే.. ఎవుసం చేసేదెలా?

పొలాల్లో రాళ్లు పడితే..  ఎవుసం చేసేదెలా?
  • సంగారెడ్డి జిల్లా గుండ్ల మాచునూరులో స్టోన్ క్రషర్ల పేలుళ్లు 
  • పనికిరాకుండా పోతున్న పంట పొలాలు 
  •  నాలుగేండ్లుగా బాధిత రైతులు సాగుకు దూరం
  • బీటలుబారుతున్న ఇండ్లు 
  • బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్తులు
  • ఓ మంత్రి, ఎమ్మెల్యేల ప్రమేయం..  పట్టించుకోని అధికారులు 

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచునూరు గ్రామస్తులు, రైతులు స్టోన్​ క్రషర్లతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన స్టోన్ క్రషర్ల వల్ల నాలుగేళ్లుగా స్థానిక రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. పొలం నిండా  రాళ్లు ఎగిరిపడుతున్నాయి. భారీ పేలుళ్లకు ఇండ్లు బీటలుబారుతున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రషర్ల కారణంగా ఇప్పటికే 30 ఎకరాల భూములు బీడువారాయి.

ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లే.. 

గుండ్ల మాచునూరు గ్రామ శివారులో కొనసాగుతున్న రెండు స్టోన్ క్రషర్లు తెలంగాణలోని ఓ మంత్రి తోపాటు జిల్లాలోని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. స్టోన్ క్రషర్ల ఇబ్బందులపై గతంలో చాలాసార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ మంత్రి, ఎమ్మెల్యే సొంత క్రషర్లు కావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సమస్య తీవ్రం కావడం, రైతుల నుంచి వ్యతిరేకత పెరగడంతో కొంతకాలం కింద ఆ రెండు క్రషర్లను మరొకరికి లీజుకు ఇచ్చిన లీడర్లు వారి పేర్లు బయటకు రాకుండా నడిపిస్తున్నట్టు సమాచారం. చేసేదేమీ లేక నాలుగేళ్ల నుంచి ఆ భూములకు దూరంగా ఉంటూ కూలి చేసుకుంటూ బతుకుతున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పర్మిషన్ అక్కడ.. బ్లాస్టింగ్ ఇక్కడ!

ఆ రెండు స్టోన్ క్రషర్లకు సంబంధించి పర్మిషన్ ఒకచోట తీసుకొని బ్లాస్టింగ్ మరోచోట చేస్తున్నట్లు తెలుస్తోంది. కంది మండలం ఆరుట్ల గ్రామ శివారులో స్టోన్ క్రషింగ్ కోసం పర్మిషన్ తీసుకుని పక్కనే ఉన్న హత్నూర మండలం గుండ్ల మాచనూరు శివారులో బ్లాస్టింగ్ చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలా ఒక చోట నుంచి క్రమంగా చుట్టుపక్కల గ్రామాల పరిధిలోకి విస్తరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పక్కనే ఉన్న అటవీ భూములను సైతం వదలకుండా దాదాపు 10 ఎకరాల వరకు కబ్జా చేసి క్రషింగ్ చేస్తున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు.  ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అక్రమంగా కొనసాగుతున్న స్టోన్ క్రషింగ్ ను ఆపి రైతులు వ్యవసాయం చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

బతుకు భారమవుతోంది.. 

పొలంలో మస్తురాళ్లు ఎగిరిపడుతున్నయి. మొదట్లో పనిచేస్తున్నప్పుడు పక్కన్నే పెద్ద రాయి పడింది. కొద్దిలో గండం తప్పి బతికి బట్ట కట్టినం. చేసేది లేక నాలుగేండ్లుగా ఎవుసం బంద్​ పెట్టినం. పని కరువైంది. బతుకు భారమైతోంది. జర పెద్దసారోళ్లు మా గోడు పట్టించుకోవాలె. ఆ మిషన్లను ఆపి మేం ఎవుసం చేసుకునేలా చూడాలె.  

- టేకు యాదయ్య, రైతు

కలెక్టర్​ స్పందించాలే..

గుండ్ల మాచునూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న స్టోన్ క్రషర్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నం. ఏండ్ల కొద్దీ వ్యవసాయం బంద్​ పెడితే బతికేదెలా? ఇండ్ల గోడలు బీటలుబారుతున్నయి. బడా లీడర్ల ప్రమేయం ఉన్నందుకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవట్లే.. ఈ సమస్యపై కలెక్టర్ స్పందించాలె. క్రషర్లను ఆపాలె.  

- శ్రీశైలం, గ్రామస్తుడు