ఇథనాల్ ఫ్యాక్టరీతో ఇబ్బందులే

ఇథనాల్ ఫ్యాక్టరీతో ఇబ్బందులే

ఇథనాల్ ఫ్యాక్టరీతో ఇబ్బందులే
రోజూ బాధలు పడ్తున్నం 
ఫ్యాక్టరీతో ఏర్పడే సమస్యలను ఏకరువు పెట్టిన పర్లపల్లివాసులు
గ్రామాన్ని విజిట్​చేసిన మూడు గ్రామాల ప్రజలు  
స్తంభంపల్లి శివారులో ఫ్యాక్టరీ పెట్టనిచ్చేది లేదన్న జనం 

కరీంనగర్, వెలుగు : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 1090లో ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించగా, స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్​ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పాశిగామ, స్తంభంపల్లి, కోటిలింగాల, వెల్గటూర్, వెంకటాపూర్ గ్రామాల ప్రజలు నెలన్నరగా రోజుకో తీరుగా నిరసన తెలుపుతున్నారు. దీంతో ఆ జిల్లా ఆఫీసర్లు ఇథనాల్ ప్రాజెక్టుతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కాలుష్యం ఉండదని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో ఇలాంటి ఫ్యాక్టరే ఉందని, కావాలంటే చూసి రమ్మని మూడు బస్సులు పెట్టి మరీ పంపించారు.

గురువారం మధ్యాహ్నం వెల్గుటూరు మండలం స్తంభంపల్లి, పాశిగామ, వెంకటాపురం గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో సహా 150 మంది గ్రామస్తులు పర్లపల్లిలోని ఇథనాల్ ఫ్యాక్టరీకి చేరుకుని పరిశీలించారు. ఆ ఫ్యాక్టరీ వల్ల ఏమైనా నష్టాలున్నాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఫ్యాక్టరీ వల్ల తాము పడుతున్న ఇబ్బందులు ఏకరువు పెట్టారు. ఫ్యాక్టరీ నడిచినప్పుడు అందులోంచి వచ్చే వాసన భరించలేకపోతున్నామని, చివరికి తామే ఊరు ఖాళీ చేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

పర్లపల్లిలో ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు కూడా వంద మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారని, కానీ ఇక్కడోళ్లకు పది మందికి కూడా రాలేదని, మొత్తం బిహార్​వాళ్లే పని చేస్తున్నారని తెలిపారు. రాత్రయితే కంపు భరించకలేకపోతున్నామన్నారు. వెల్గటూరు మండల ప్రజల విజిట్ ఉండడంతో వాసనను తగ్గించేందుకు రెండు రోజుల ముందే ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ నిలిపివేసినట్లు తెలిసింది. 

ఫ్యాక్టరీని పెట్టనిచ్చేది లేదు 

పర్లపల్లివాసులతో మాట్లాడడం, ఫ్యాక్టరీ పరిసరాలను చూసిన తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రతిపాదిత గ్రామాల ప్రజలు మాట్లాడుతూ... ఆఫీసర్లు అంతా బాగుంటుందని చెప్తే చూద్దామని వచ్చామని, ఇక్కడికి వచ్చాక ఇథనాల్ ఫ్యాక్టరీతో ఇబ్బందులేమిటో తెలిశాయన్నారు. ఇక్కడ భరించలేని వాసన వస్తోందని, ఇక్కడి వారితో మాట్లాడాక ఎలాగైనా ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకోవాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం మంత్రి కేటీఆర్ దగ్గరికి గానీ, అవసరమైతే సీఎం కేసీఆర్ దగ్గరికిగానీ వెళ్లేందుకు మూడు గ్రామాల ప్రజలం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.   

ఇథనాల్ ఫ్యాక్టరీతో ఇబ్బందులు పడుతున్నం..ఇండ్ల బయట నీళ్లతో కడుగుతుంటే నల్లగా మారి కాల్వల్లోకి పోతోంది. ఎవలన్న రాత్రి పూట బయట పండుకుంటే గాలి ఊపిరితిత్తుల్లకు పోయి కరాబై చనిపోయే పరిస్థితి ఉంది. ఈ ఫ్యాక్టరీ వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి సమస్యలు చాలా వస్తున్నయ్. ఇది ఎట్లా పోతదో ఏమోగానీ మేమే ఊరు విడిచిపెట్టేకాడికి వస్తదేమో అనిపిస్తంది.  

-  ఇదీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లివాసి ఎస్కే రషీద్

ఆవేదన ఎంతవరకైనా కొట్లాడుతం

పర్లపల్లిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీ మేనేజ్ మెంట్ అనేటోళ్లు కూడా మనుషులే కదా. సాటి మనుషులకు నష్టం కలిగించొద్దనే ఇంగితజ్ఞానం వాళ్లకు ఉండాలి కదా. ఇవ్వాళ తమ స్వార్థం కోసం ఇంత మంది జనాలను ఇబ్బంది పెట్టాలని చూడడం సరికాదు. ఇలాంటి ఫ్యాక్టరీలను జనావాసాలకు దూరంగా పెట్టుకోవాలి. 2 వేల మందికి ఉపాధి వస్తుందని మంత్రిని ఫ్యాక్టరీవాళ్లు మిస్ గైడ్ చేశారు. ఫ్యాక్టరీని ఆపేందుకు కేసీఆర్ దగ్గరికైనా వెళతాం. ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంతవరకైనా కొట్లాడుతాం.  

- రాంచందర్, స్తంభంపల్లి సర్పంచ్ భర్త  

మా ఊరికి కొప్పుల ఈశ్వర్ చేసిందేమీ లేదు... 

మంత్రి కొప్పుల ఈశ్వర్ మా ఊరికి సాయం చేస్తనంటే ఐదుసార్లు గెలిపించినం. మా ఊర్లో గురుకుల హాస్టల్ పెడతా అన్నడు. వంద పడకల హాస్పిటల్ అన్నడు. కాలేజీ అన్నడు. ఇప్పటివరకు ఏదీ పెట్టలే. ఈ మధ్యేమో ఇథనాల్ ప్రాజెక్టు అని కొబ్బరికాయ కొట్టి పోయిండు. మాకు ఆ ఫ్యాక్టరీ గురించి తెలిసినప్పటి నుంచి వద్దని కొట్లాడుతున్నం.  ఓ మేడం వచ్చి ఏం  కాదంటూ మమ్మల్ని పర్లపల్లికి పంపింది. ఇక్కడ వచ్చినంక చూస్తే  పంటలేమోగానీ  వాసనను తలుచుకుంటేనే అన్నం  తినలేం. ఆ ఫ్యాక్టరీ పెడితే మేం బతకలేం.  

- సత్తవ్వ, వ్యవసాయ కూలీ, పాశిగామ