- ఈసారి ఎండలు ఎక్కువ ఉండే చాన్స్
- డిమాండ్ ఇంకా తగ్గొచ్చు
న్యూఢిల్లీ: 2023 ఆర్థిక సంవత్సరంలో పల్లెటూళ్ల నుంచి టూవీలర్లను, ట్రాక్టర్లను కొనేవారి సంఖ్య విపరీతంగా తగ్గింది. టూవీలర్స్ రిటైల్ అమ్మకాలు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ట్రాక్టర్లు అమ్మకాలు కూడా డల్‌గానే ఉన్నాయని రిటైలర్లు చెబుతున్నారు. మిగతా బండ్ల కంటే ట్రాక్టర్ల సేల్స్గ్రోత్ చాలా తక్కువ ఉందని అంటున్నారు. ఇన్ఫ్లేషన్(ధరల పెరుగుదల) ఎఫెక్ట్ గ్రామీణ భారతదేశంపై చాలా ఎక్కువగా ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది.
ఇది మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం టూవీలర్ల విభాగం వార్షిక ప్రాతిపదికన గ్రోత్‌ని సాధించినప్పటికీ, అమ్మకాలు ఇప్పటికీ కరోనాకు ముందుస్థాయిలో లేవు. 2019కి ముందు సేల్స్‌తో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. “టూ-వీలర్ కేటగిరీ 12శాతం యానువల్ గ్రోత్‌ను సాధించింది. కరోనా ముందుస్థాయిల కంటే ఇది 9శాతం తక్కువగా ఉంది.
పల్లెటూళ్ల నుంచి గిరాకీ లేదు. అన్నింటి ధరలు పెరగడంతో బండ్లు కొనడానికి జనం వెనకాడుతున్నారు” అని ఫాడా ప్రెసిడెండ్ మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. ఇండియాలోని కొన్ని ద్వీపకల్ప ప్రాంతాల్లో మినహా చాలాచోట్ల ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఎండలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.
దీనివల్ల వ్యవసాయ పనులు తక్కువగా ఉంటాయి కాబట్టి రాబోయే నెలల్లోనూ టూవీలర్ల, ట్రాక్టర్ల వంటి బండ్ల అమ్మకాలూ తక్కువగానే ఉండొచ్చని ఎక్స్పర్టులు అంటున్నారు. తక్కువ సాగు ఆదాయాలు మొత్తం డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ఇదే ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఎల్ నినో ప్రభావం కూడా ఉండొచ్చు. పసిఫిక్ మహాసముద్రంలో ఒకరకమైన కాలానుగుణమైన మార్పును ఎల్‌నినో అంటారు. దీనివల్ల చలికాలంలోనూ ఎండలు ఉంటాయి.
కరువులు వస్తాయి. గత 20 ఏళ్లలో వచ్చిన కరువులన్నింటికీ ఎల్‌నినోయే కారణం. ‘‘దీనివల్ల రుతుపవనాలు కూడా బలహీనంగా మారి వర్షాలు తగ్గుతాయి. దీంతో రూరల్ ఇండియా గ్రోత్ దెబ్బతింటుంది. ఉత్తర, మధ్య భారతదేశంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు కీలకమైన రబీ పంటలను నాశనం చేశాయి. పంట కోత ఆలస్యం అయింది. గ్రామాల నుంచి డిమాండ్ తగ్గడానికి ఇవన్నీ కారణమే”అని ఫాడా తెలిపింది.
రికార్డు లెవెల్లో కార్ల అమ్మకాలు
2022 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో బండ్ల రిటైల్ అమ్మకాలు వార్షికంగా 14శాతం పెరిగాయి. ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాలు రెండంకెల గ్రోత్‌ని సాధించాయి. టూవీలర్స్, త్రీవీలర్స్, ప్యాసింజర్ వెహికల్స్ (కార్లు), కమర్షియల్ వెహికల్స్ (సీవీలు) వరుసగా 12శాతం, 69శాతం, 14శాతం, 10శాతం గ్రోత్‌ని సాధించగా, ట్రాక్టర్ సెగ్మెంట్ గ్రోత్ మార్చిలో 4శాతానికి పరిమితమయింది. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇదే పోకడ కనిపించింది. ట్రాక్టర్ల విభాగం ఇతర విభాగాల కంటే వెనుకబడింది.
2023 ఆర్థిక సంవత్సరంపై కరోనా ఎఫెక్ట్ ఏమీ లేదు కాబట్టి రిటైల్ అమ్మకాలు 21శాతం గ్రోత్‌ని సాధించాయని సింఘానియా చెప్పారు. టూవీలర్స్, త్రీవీలర్స్, పీవీలు , సీవీలు వరుసగా వరుసగా 19శాతం, 84శాతం, 23శాతం 33శాతం గ్రోత్‌ని (పూర్తి ఆర్థిక సంవత్సరానికి)సాధించాయి. ట్రాక్టర్ల సెగ్మెంట్ వార్షిక ప్రాతిపదికన 8శాతం గ్రోత్‌ని సాధించింది.
కార్లు రికార్డుస్థాయిలో 36 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 సంవత్సరంలో అమ్మకాలు 32 లక్షల వరకు ఉన్నాయి. ఎక్కువ బేస్, ధరల భారం, ఖర్చులు పెరగడం, కొత్త రూల్స్ రావడం వల్ల 2024 ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ తగ్గవచ్చని ఫాడా తెలిపింది.
