
సాదాబైనామాలకు పట్టాలియ్యడంలో సర్కార్ నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన యాళ్ల జైపాల్ రెడ్డి తండ్రి రాజారెడ్డి.. 36ఏళ్ల కింద మావల గ్రామానికి చెందిన అబ్దుల్ ఘనీ నుంచి 8 ఎకరాల పొలం కొనుక్కొన్నాడు. పెద్దమనుషుల సమక్షంలో బాండ్ పేపర్ మీద ఒప్పందం రాయించుకున్నారు. అప్పటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులు. మూడేళ్ల క్రితం రాజారెడ్డి చనిపోయాడు. దీంతో పట్టా కోసం ఆయన కొడుకు జైపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. సాదాబైనామా ఉన్నవాళ్లందరికీ పట్టాలిస్తామని సర్కార్ చెప్పినా.. అధికారులు మాత్రం పట్టించుకోలేదు. పైగా ఆ భూమికి తమ పేరుతో కాకుండా.. అప్పట్లో అమ్మిన వ్యక్తి అబ్దుల్ ఘనీ పేరుతోనే ధరణిలో కొత్త పట్టాలు వచ్చాయి. దీంతో తమ దగ్గర ఉన్న సాదాబైనామాను చూపించి.. పట్టాపుస్తకాన్ని తమ పేరుపై మార్చాలని తండ్రి, కొడుకులు.. అధికారుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకోలేదు. ఇదే టైంలో అప్పట్లో భూమి అమ్మిన అబ్దుల్ ఘని వారసులు ఆసీఫ్, యూసూఫ్ లు వచ్చి ఆ భూమి తమదంటూ వివాదం మొదలుపెట్టారు. పొలం నుంచి వెళ్లిపోవాలంటూ ఆ రైతు కుటుంబాన్ని బెదిరించారు. తర్వాత దాడి కూడా చేశారు.
నిన్న జైపాల్ రెడ్డి, ఆయన భార్య వెంకటమ్మ, కొడుకు చరణ్ రెడ్డి పొలానికి వెళ్లారు. అయితే ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మేందుకు ప్రయత్నించిన ఆసిఫ్, యూసుఫ్ లు రియాల్ మాఫియాతో కలిసి.. ఆ కుటుంబంపై దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన జైపాల్ రెడ్డి, చరణ్ రెడ్డి అక్కడే పురుగుల మందు తాగారు. దీంతో అక్కడే ఉన్న రైతులు.. వాళ్లను ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. రైతులపై దాడి విషయం తెలుసుకున్న కుజ్జర్ల గ్రామస్తులు రిమ్స్ కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబంతో కలిసి రిమ్స్ ఎదుట నేషనల్ హైవేపై బైఠాయించారు. ఆసీఫ్, యూసుఫ్ లు TRS నేతలు కావడంతో.. రెవెన్యూ అధికారులు నిందితులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు గ్రామస్థులు. బాధితులకు న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ నటరాజన్ హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
మరిన్ని వార్తల కోసం :-
మెట్టుగూడలో పోలీసుల ఓవర్ యాక్షన్
అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు