డబుల్​ఇండ్ల పేర్లలో మార్పులుండడంతో గ్రామస్థుల లొల్లి

 డబుల్​ఇండ్ల పేర్లలో మార్పులుండడంతో గ్రామస్థుల లొల్లి
  • పేర్లలో మార్పులుండడంతో గ్రామస్థుల లొల్లి
  • కొత్త లిస్ట్​ తయారు చేయాలని డిమాండ్​
  • పెట్రోల్ పోసుకునేందుకు వార్డు మెంబర్ యత్నం 
  • వెనుదిరిగిన అధికారులు

దుబ్బాక, వెలుగు: డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవతవకలు జరిగాయని గురువారం చీకోడ్​ గ్రామ పంచాయతీ ఆఫీసు ఎదుట గ్రామస్థులు ధర్నా చేశారు. ఆదివారం మంత్రి హరీశ్​రావు ‘డబుల్’​ ఇండ్లను ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం సర్పంచ్​ తౌడ శ్రీనివాస్​ అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్​లిస్ట్​లో ఉన్న పేర్లకు, సెకండ్ ​లిస్ట్ ​పేర్లకు తేడా ఉండడంతో గొడవ మొదలైంది. ఇండ్లు, భూములు, బండ్లు ఉన్నవాళ్లనే ఎంపిక చేశారని, ఆ రెండు లిస్టులు క్యాన్సిల్​చేసి గ్రామ సభలోనే కొత్త లిస్ట్ తయారు చేయాలని డిమాండ్​ చేశారు. పేర్లు రాని వారు కూడా లొల్లికి దిగారు. ఇది కాస్తా ఎంపికైన లబ్ధిదారులు, పేర్లు లేని వారి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఆఫీసర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు ఎంత సముదాయించిన అక్కడున్న వారు వినలేదు. ఈ సందర్భంగా సర్పంచ్​ శ్రీనివాస్ జోక్యం చేసుకుని 100 ఇండ్లు శాంక్షన్​ అయితే 65 కట్టారని,  మిగిలిన 35 ఇండ్లు కట్టాక రాని వారికి కూడా ఇస్తామన్నారు.  మంత్రి వస్తున్నాడు కాబట్టి డిస్టర్బ్​ చేయవద్దని కోరారు. అయినా అర్హులకే ఇవ్వాలని పట్టుబట్టడంతో గ్రామ పంచాయతీ రూమ్​లోకి వెళ్లిపోయారు. ఇంతలోనే10వ వార్డు మెంబర్​ కొమిరె నరేశ్​ తాను నిరుపేదనని,  తనకు డబుల్​ బెడ్​రూమ్​రాలేదని, తన వార్డులో అర్హులైన వారి పేర్లు కూడా లేవని ఒంటిపై పెట్రోల్​ పోసుకోబోయాడు. దీన్నిచూసిన ఎంపీటీసీ లచ్చమ్మగారి రాంరెడ్డి, సర్పంచ్​ శ్రీనివాస్​ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పెనుగులాటలో అక్కడున్నవారిపై పెట్రోల్​పడడంతో ఎటోళ్లటు పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదంతా చూసి ఆఫీసర్లు వెళ్లిపోయారు. కాగా, వార్డ్ ​మెంబర్​ నరేశ్ ​తమపైనే పెట్రోల్​ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడని సర్పంచ్​ శ్రీనివాస్​ పీఎస్​లో కంప్లయింట్ ​ఇచ్చాడు.