బీఆర్ఎస్ జెండా దిమ్మెకు నల్ల రంగు వేసి ముంపు గ్రామస్తుల నిరసన

బీఆర్ఎస్ జెండా దిమ్మెకు నల్ల రంగు వేసి ముంపు గ్రామస్తుల నిరసన

గద్వాల, వెలుగు: ముంపునకు గురవుతున్న గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామస్తులు గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్​ జెండా కట్టకు నల్లరంగు వేయడంతో పాటు ధ్వంసం చేశారు. గ్రామంలో బీఆర్ఎస్  జెండా ఎగరవేసేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తుండగా, గ్రామస్తులు అడ్డుకొని గద్దెకు నల్ల రంగు వేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ భూములు, ఇండ్లు బలవంతంగా గుంజుకొని ఎకరా ఆయకట్టు లేని చిన్నోనిపల్లి రిజర్వాయర్ కడుతున్నారని ఆరోపించారు. ముంపునకు గురవుతున్న గ్రామంలో పార్టీ జెండా ఎందుకని అడ్డుకొని నల్ల రంగు వేసినట్లు చెప్పారు. మండలానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి నల్ల రంగు ఎందుకేశారని బెదిరించినట్లు ఆరోపించారు. ప్రజాప్రతినిధి మాటలతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు జెండా కట్టను ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేని కొమ్ము తిమ్మప్పను పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించారు. ఇదిలాఉంటే తిమ్మప్పను విడిచి పెట్టాలని, లేదంటే పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరించడంతో పోలీసులు ఆయనను విడిచిపెట్టారు.