లో వోల్టేజ్​ సమస్య  పరిష్కరించాలంటూ రాస్తారోకో

లో వోల్టేజ్​ సమస్య  పరిష్కరించాలంటూ రాస్తారోకో

జన్నారం, వెలుగు: తమ గ్రామానికి కరెంట్ సరఫరాలో ఏర్పడుతున్న ఓల్టేజ్ సమస్యను పరిష్కరించి, మినీ సబ్ స్టేషన్​ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఇందన్ పెల్లి గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు మొయిన్ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఓల్జేజ్ లో హెచ్చుతగ్గుల కారణంగా వ్యయసాయ మోటర్లతో పాటు ఇండ్లలోని ఫ్రిజ్ లు, టీవీలు, ఫ్యాన్లు కాలిపోతున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని సంబంధిత ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తమ గ్రామంలో మినీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి, పర్మినెంట్ లైన్​మెన్​ను నియమించాలని డిమాండ్ చేశారు.

సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వెహికల్స్ నిలిచిపోయి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. అడిషనల్ ఎస్సై తానాజీ రాథోడ్ అక్కడికి చేరుకొని, ట్రాన్స్​కో సబ్ ఇంజనీర్ అజయ్ ను పిలిపించి గ్రామస్తులతో మాట్లాడించారు. ఈ నెల 20వ తేదీలోపు విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని సబ్ ఇంజనీర్ హమీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు కంటెం శంకర్, విక్రమ్, ఉపసర్పంచ్ కాసారపు చంద్రగౌడ్, మాజీ ఉప సర్పంచ్ కాండ్రాపు మల్లేశ్, గ్రామానికి చెందిన యువకులు భారీగా పాల్గొన్నారు.