
జిన్నారం, వెలుగు: మండలంలోని పచ్చటి గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చొద్దని మండలంలోని రాళ్లకత్వ గ్రామస్తులు సోమవారం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పటాన్ చెరు, జిన్నారం రహదారిపై మున్సిపాలిటీ మాకొద్దు పంచాయతీ ముద్దు అని ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు ఆది రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం పల్లెలను మున్సిపాలిటీలుగా మార్చి రైతుల దగ్గరున్న అసైన్డ్ భూములను గుంజే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
మున్సిపాలిటీ చేస్తే పేదలకు ఉపాధి హామీ పథకం వర్తించదని, గ్రామ కంఠం భూముల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలన్న, వ్యవసాయ రుణాల విషయంలో వెసులుబాటు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాయి కుమార్ గౌడ్, ఆది నర్సింలు, దయానంద గౌడ్, రఘుపతి, గ్రామ అఖిలపక్ష నాయకులు, యువకులు పాల్గొన్నారు.