- అధికారులు, పోలీసులకు మరో వర్గం లీడర్ల ఫిర్యాదు
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం లీడర్లు నిర్వహించారు. ఆ వేలాన్ని కొందరు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో మంగళవారం అధికారులు, పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జగ్గాసాగర్ గ్రామం సర్పంచ్ రిజర్వేషన్ బీసీ జనరల్ కావడంతో 12 మంది నామినేషన్ వేశారు.
కాగా గ్రామంలోని రెండు సామాజికవర్గాల మధ్య ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే ఓ స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ వివాదం మరింత పెరిగింది. కొందరు లీడర్లు రహస్యంగా మీటింగ్ పెట్టుకొని సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు వేలం నిర్వహించగా.. ఓ వ్యక్తి సుమారు రూ.28.60లక్షలకు దక్కించుకున్నాడు. ఈ విషయం వ్యతిరేక వర్గానికి తెలియడంతో వారు పోలీసులు, ఎన్నికల అధికారులకు సమాచారమిచ్చారు.
అధికారులు వస్తున్నారని తెలియడంతో వారంతా వెనుదిరిగారు. కాగా వ్యతిరేక వర్గం లీడర్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వేలం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. స్థలం విషయంతోపాటు వేలం నిర్వహణపై అడ్డుకోవడంపై తమను గ్రామ బహిష్కరణ చేసినట్లు ఆరోపించారు. సర్పంచ్ వేలం విషయమై డీఎస్పీ, ఎన్నికలకు ఫిర్యాదు చేశామని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై 10 మందిని బైండోవర్ చేసినట్లు తహసీల్దార్ నీతా తెలిపారు.
