వెల్దుర్తి, వెలుగు: రాకపోకలకు అసౌకర్యంగా మారిన రోడ్డు అభివృద్ధి చేయకుంటే పంచాయతీ ఎలక్షన్ బహిష్కరిస్తామని నాలుగు గ్రామాల ప్రజలు హెచ్చరించారు. ఆదివారం శెట్టిపల్లి కలాన్ గ్రామ చౌరస్తా వద్ద వెల్దుర్తి మండల పరిధిలోని శెట్టిపల్లి కలాన్, బండ పోసానిపల్లి, రామాయపల్లి, ఎదులపల్లి గ్రామాల ప్రజలు ధర్నా నిర్వహించారు.
వారు మాట్లాడుతూ.. వెల్దుర్తి మండల కేంద్రం నుంచి మెదక్ పట్టణం వరకు ఉన్న 19 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డు పూర్తిగా శిథిలమైందని, వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ రోడ్డును వెంటనే రెండు వరుసలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామన్నారు.
