బొజ్జ గణపయ్యకు అవంటే చాలా ఇష్టం.. ఎందుకో తెలుసా

బొజ్జ గణపయ్యకు అవంటే చాలా ఇష్టం.. ఎందుకో తెలుసా

దేశ వ్యాప్తంగా వినాయకచవితి వేడుకలకు ప్రజలు సిద్దమవుతున్నారు.  ప్రతి వీధిలో కూడా గణపయ్యను ప్రతిష్టించేందుకు భక్తులు  అనేక రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.   హిందువులు ఏ శుభకార్యం తలపెట్టినా.... ఎలాంటి పూజలు చేసినా మొదట ఆయనను ఆరాధించాల్సిందే. భాద్రపదమాసం శుక్లపక్షంలోని చవితి తిథిని వినాయకుడిని పుట్టిన రోజుగా భావించి.. వినాయకచవితి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.  అయితే ఈ పండుగను తొమ్మిది రోజులు  హిందువులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. అందరినీ ఆశీర్వదించే గణపయ్య అనేక రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.  కాని ఎన్ని  సమర్పించినా ఉండ్రాళ్లు, కుడుములు  బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు.  అసలు గణేశుడికి కుడుములు, ఉండ్రాళ్లు అంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం. . . .  

గణపతి మోదకప్రియుడు. కుడుములు, ఉండ్రాళ్లు, మోదకాలను స్వామివారికి నివేదిస్తుంటారు. లక్షో లక్షపతిర్లక్ష్యో లయస్థో లడ్డుక ప్రియః....లాసప్రియో లాస్యపరో లాభకృల్లోక విశ్రుతః॥’ అని  గణపతి సహస్రనామ స్తోత్రం....లోకఖ్యాతి గడించిన వినాయకుడిని లడ్డుక ప్రియః అని గణేశ పురాణమూ చెబుతున్నది. అందుకే వినాయకుడికి ఉండ్రాళ్లు, కుడుములు, మోదక్‌లతోపాటు లడ్డూలనూ నివేదనగా సమర్పిస్తారని పండితులు చెబుతున్నారు. ఇక వినాయకుడిని ముదాకరాత్త మోదకం, సదా విముక్తి సాధకం అని గణేశ పంచరత్న స్తోత్రంలో గజాననుడిని స్తుతించారు ఆదిశంకరాచార్యులు.  మోదకాలను నైవేద్యంగా పెట్టగానే ఆనందించే దైవమా!’ అని కీర్తించారు.

గణపతికి ఇష్టమైన కుడుముల గురించి పురాణాల్లోనూ ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి బాల గణపతితో కలిసి శివపార్వతులు అరణ్యంలో సంచరిస్తుంటారు. గణేశుడికి ఆకలి వేయడంతో సమీపంలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తారు. వారికి ఘనమైన అతిథ్యం ఇస్తారు అత్రి మహర్షి, అనసూయాదేవి దంపతులు. ఆకలిగా ఉన్న బాల వినాయకుడికి పంచభక్ష్య పరమాన్నాలు చేసి వడ్డిస్తుంది అనసూయాదేవి. ఎంత తిన్నా, బొజ్జ గణపయ్య ఆకలి తీరదు. అప్పుడు ఆ ఇల్లాలు వరిపిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుంది. అది తినగానే గణపతి బొజ్జనిండి 21సార్లు త్రేన్చాడట... అప్పటినుంచి 21 కుడుములు, 21 ఉండ్రాళ్లు గణపతికి నైవేద్యంగా పెట్టి, ఒక్కోటి గణపతికి ఇచ్చి, పదేసి చొప్పున దానం చేసి, మిగతావాటిని ప్రసాదంగా తినే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. వినాయక మంటపాల్లో కుడుములకు ప్రతిగా లడ్డూను స్వామివారికి సమర్పించే ఆచారం ఉంది.