హైదరాబాద్ను వణికిస్తున్న వైరల్ ఫీవర్ .. ఆస్పత్రులకు క్యూ కడుతున్న పేషెంట్లు

హైదరాబాద్ను  వణికిస్తున్న వైరల్ ఫీవర్ .. ఆస్పత్రులకు క్యూ కడుతున్న పేషెంట్లు
  • ఆస్పత్రులకు క్యూ కడుతున్న పేషెంట్లు  
  • ఫీవర్, గాంధీ, ఉస్మానియాలో రద్దీ
  •  రోజుకు వందల్లోనే వస్తున్న ఓపీలు

హైదరాబాద్, వెలుగు:  సిటీ జనాలను వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. కొద్దిరోజులుగా  ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిమ్స్ తదితర ఆస్పత్రులకు పేషెంట్ల రద్దీ పెరిగిపోయింది. ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు వైరల్ ఫీవర్​తో బాధపడుతుండగా.. మురికివాడలు, బస్తీల్లోనే బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. సర్దీ, జలుబు, దగ్గు, ఫీవర్, ఫుడ్  పాయిజనింగ్, వాంతులు ..ఇలా అనారోగ్య కారణాలతో చిన్నా, పెద్దా అందరూ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. 

ఫీవర్ హాస్పిటల్​లో..

నెల రోజుల కిందటి వరకు ఫీవర్ ఆస్పత్రిలో రోజుకు 300 ఓపీలు వచ్చేవి. ప్రస్తుతం రోజుకు 600 నుంచి 800లకు పైగా నమోదవుతుండగా.. ఇందులో ఎక్కువ శాతం వైరల్ ఫీవర్ పేషెంట్లే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు.రోజూ 70 దాకా ఇన్ పేషెంట్లు ఉంటుండగా...

ALSO READ :- మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలి : సృజన

ఇప్పుడు ఆ సంఖ్య 140కి పెరిగింది. డెంగీ, మలేరియా కేసులు కూడా వస్తుండగా... ప్రతిరోజూ 5  డెంగీ, 3 మలేరియాతో బాధపడుతూ ఫీవర్ ఆస్పత్రికి వస్తున్నట్టు డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే వైరల్ ఫీవర్ల బారినుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.

ఉస్మానియా, గాంధీలోనూ..

 ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్​  కూడా పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియాలో ఒక్క రోజే దాదాపు 400 జనరల్ కేసులు నమోదయ్యాయి. గాంధీలో 300కు పైగా వచ్చాయి. గాంధీలో గత గురువారం 13, శుక్రవారం 22 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి. పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఓపీ సమయాన్ని పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నెల రోజులుగా ఎక్కువ వస్తున్నాయి

వాతావరణంలో మార్పుల కారణంగా నెల రోజులుగా వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించడంతో సీజనల్ ఫీవర్ల సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడు కరోనా భయం లేకపోయినా.. కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. దీంతో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజలు రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలి.   
  - చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఎంవో, ఫీవర్ హాస్పిటల్, నల్లకుంట