
ఆమె ఒక ఫ్లైట్ అటెండెంట్. తాను విధులు నిర్వర్తిస్తున్న విమానంలో వెరీ వెరీ స్పెషల్ వ్యక్తి ఒకరు ఆమెకు కనిపించారు. అది మరెవరో కాదు.. 30 ఏళ్ల కిందట తనకు స్కూల్ లో విద్యాబుద్ధులు నేర్పించి, కెరీర్ గైడెన్స్ ఇచ్చిన ఉపాధ్యాయురాలు. దీంతో ఆ ఫ్లైట్ అటెండెంట్ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే విమానంలోకి మైక్రో ఫోన్ ను తీసుకొని.. తన మనసులోని మాటలను ప్రయాణికులు అందరితో పంచుకుంది. ఈ అరుదైన అనుభవం కెనడాలోని జెట్ సీఎస్‌ఏ విమానంలో ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేసే లోరీకి ఎదురైంది.
‘‘మీ అందరి మధ్య నా ప్రియమైన టీచర్ కూర్చొని ఉన్నారు. ఆమె నన్ను షేక్స్‌పియర్‌ని ప్రేమించేలా చేసింది. పియానో వాయించేలా చేసింది. ఆమె చిన్నప్పుడు అందించిన ప్రోత్సాహమే పునాదిగా పియానో వాయించడంలో మాస్టర్స్ కోర్సు చేశాను. దానిపై ఒక వ్యాసం కూడా రాయగలను. ధన్యవాదాలు టీచర్ ఓకానెల్’’ అని ఉద్వేగానికి గురవుతూ లోరీ చెప్పారు.
ఆ వెంటనే మైక్రో ఫోన్ ను పక్కన పెట్టేసి చిన్న పిల్లల్లా పరుగెత్తుతూ టీచర్ వద్దకు వెళ్లి కౌగిలించుకుంది. టీచర్ ఓకానెల్ యోగ క్షేమాలను లోరీ ఆప్యాయంగా అడిగి తెలుసుకుంది. అయితే ఈ ఘటన అనూహ్యంగా ఇంటర్నేషనల్ టీచర్స్ డే రోజునే జరగడం విశేషం.దీనికి సంబంధించిన వీడియోను కియోనా థ్రాషెర్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.