కశ్మీరీలకు రూమ్స్ అద్దెకివ్వమన్న హోటల్

కశ్మీరీలకు రూమ్స్ అద్దెకివ్వమన్న హోటల్

న్యూఢిల్లీ: అద్దెకు గది కావాలని కోరుతూ వచ్చిన ఓ కస్టమర్ తో ఓ హోటల్ నిర్వాహకులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. కశ్మీరీ అయినందుకు ఆ వ్యక్తికి రూమ్ రెంట్ కు ఇవ్వడానికి హోటల్ యజమాని తిరస్కరించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అద్దెకు ఉండేందుకు ఓ వ్యక్తి ఓయో యాప్ లో రూమ్ ను ముందే బుక్ చేసుకున్నాడు. అతడిది కశ్మీర్. అయితే హోటల్ లో చెక్ ఇన్ అయ్యే సమయంలో అతడ్ని రిసెప్షనిస్ట్ అడ్డుకుంది. ఆ వ్యక్తి ఆధారు కార్డు తదితర డాక్యుమెంట్లు చూసి.. అతడు కశ్మీర్ కు చెందిన వ్యక్తి అని ఖాయం చేసుకుంది. ఆ వ్యక్తికి రూమ్ అద్దెకు ఇచ్చేది లేదని చెప్పింది. ఎందుకివ్వరని ప్రశ్నిస్తే.. తన పైఅధికారికి కాల్ చేసింది. అనంతరం కశ్మీర్ కు చెందిన వారికి గదులు ఇవ్వొద్దని ఢిల్లీ పోలీసులు తమకు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చారని బదులిచ్చింది. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జమ్మూ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి నాసిర్ ఖుమ్హీ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రభావం గ్రౌండ్ లెవల్ లో విస్తరిస్తోందని క్యాప్షన్ జత చేశారు. కశ్మీరీలవడం తమ తప్పా అని క్వశ్చన్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కశ్మీర్ పౌరులకు రూమ్ ఇవ్వొద్దని తాము సూచనలు జారీ చేయలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఓయో సంస్థ కూడా స్పందించింది. రూమ్ ఇవ్వడానికి ఎందుకు తిరస్కరించారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని తెలిపింది. సదరు హోటల్ ను తమ ప్లాట్ ఫామ్ నుంచి వెంటనే తొలగిస్తున్నామని పేర్కొంది. తమ రూమ్స్, హృదయాలు అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని వివరించింది. ఇకపోతే, దేశ సినీ రంగంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా రేపుతున్న ప్రకంపనలు అంతాఇంతా కాదు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిన్న సినిమా.. రీసెంట్ గా రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది. ముప్పై ఏళ్ల కింద కశ్మీర్ లో హిందువులు.. ముఖ్యంగా పండిట్లు ఎదుర్కొన్న సమస్యలు, స్వస్థలాలను వదిలి వారు వెళ్లిపోవడం, టెర్రరిస్టుల హింసాకాండను చూపిస్తూ ఈ సినిమా తెరకెక్కింది. 

మరిన్ని వార్తల కోసం:

యోగి ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు

నువ్వా–నేనా!: అంబానీ–అదానీల మధ్య ముదురుతున్న పోటీ

సమ్మర్‌‌‌‌లో సమంత సిటాడెల్‌!