Virat Kohli: అతడితో కాఫీ తాగాలని ఉంది.. టెన్నిస్ దిగ్గజం కోసం కోహ్లీ ఎదురు చూపులు

Virat Kohli: అతడితో కాఫీ తాగాలని ఉంది.. టెన్నిస్ దిగ్గజం కోసం కోహ్లీ ఎదురు చూపులు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ పరుగుల వీరుడు గ్రౌండ్ లోకి వస్తే స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది. కోహ్లీని ఒక్కసారి కలిస్తే చాలు జన్మ ధన్యం అనుకునేవారు చాలా మందే ఉన్నారు. అయితే కోహ్లీ మాత్రం ఒక వ్యక్తిని కలవాలని తెగ ఆరాటపడుతున్నాడు. అతనితో కాఫీ తాగాలని కోరుకుంటున్నాడు. అతడెవరో కాదు టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్. 
   
సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్.. తనకు క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఉన్న సన్నిహిత్యం గురించి ఇటీవలే సోనీ స్పోర్ట్స్​ ఛానెల్​లో తెలిపాడు. కోహ్లీతో కొంతకాలంగా తనకు పరిచయం ఉందని.. అతనితో కమ్యూనికేట్ అయ్యే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పాడు. ‘కోహ్లీతో కొంతకాలంగా చాట్ చేస్తున్నా. అయితే, అతన్ని ఇప్పటివరకు కలిసే అవకాశం రాలేదు. అతను నా గురించి మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నా. కోహ్లీ తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించాడు. అతడిని నేను ఎప్పుడూ అభినందిస్తా.’ అని జకోవిచ్ చెప్పాడు.

దీనిపై తాజాగా విరాట్ స్పందించాడు. బీసీసీఐ టీవీతో జకోవిచ్​తో ఉన్న బాండింగ్​​ గురించి కోహ్లీ మాట్లాడుతూ..'వరల్డ్​టాప్ క్లాస్​ అథ్లెట్​తో కనెక్ట్​ అవ్వడం హ్యాపీ. ఫిట్​నెస్ పట్ల అతడికి ఉన్న ప్యాషన్, నన్ను కూడా ప్రభావితం చేస్తుంది. అతడు త్వరలోనే భారత్ వస్తానన్నాడు. ఒకవేళ నేను భారత్​లో ఉన్నప్పుడు జకోవిచ్ ఇక్కడకు వచ్చినా లేదా అతడు ఆడే దేశంలో నేను అక్కడ ఉన్నా కలిసేందుకు వెళ్తాను. కచ్చితంగా జకోవిచ్​తో కలిసి కప్ కాఫీ తాగుతా' అని విరాట్ అన్నాడు. జొకోవిచ్ కొన్ని రోజుల క్రితమే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తో టెన్నిస్ కోర్ట్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఎప్పుడు కలుస్తారో చూడాలి.