కింగ్ వస్తున్నాడు: 15 ఏండ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న విరాట్ కోహ్లీ

కింగ్ వస్తున్నాడు: 15 ఏండ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో  చెలరేగాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు డకౌట్లతో నిరాశపర్చిన రన్ మెషిన్ సౌతాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించి తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించాడు. చూడముచ్చటైనా షాట్లతో వింటేజ్ కోహ్లీని గుర్తు చేశాడు. ఈ సెంచరీతో ఫుల్ ఖుషిలో ఉన్న కోహ్లీ అభిమానులకు మరో గుడ్ న్యూస్. 

టెస్ట్, టీ20  ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి కేవలం వన్డేలే ఆడుతోన్న కోహ్లీని దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో చూడవచ్చు. దాదాపు 15 ఏళ్ల తర్వాత కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. రాబోయే విజయ్ హజారే టోర్నమెంట్‌కు అందుబాటులో ఉంటానని ఈ మేరకు కోహ్లీ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‎కు సమాచారం ఇచ్చాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడటాన్ని ధృవీకరించింది. 

►ALSO READ | IND vs SA: ఆడితేనే జట్టులో ఉంటారు: సౌతాఫ్రికాతో రెండో వన్డే.. టీమిండియాలో ఆ ఇద్దరికీ చివరి అవకాశం

విరాట్ కోహ్లీ రాబోయే విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీకి తెలియజేశాడని DDCA కార్యదర్శి అశోక్ శర్మ తెలిపారు. దీంతో కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడతాడా లేదా అన్న ఊహాగానాలకు తెరపడింది. కోహ్లీ చివరిసారిగా 2010 ఫిబ్రవరిలో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరుఫున ఆడాడు. టెస్ట్, టీ20  ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన భారత దిగ్గజ క్రికెటర్ రోహిత్, కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతోన్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో ఫిట్ నెస్, మ్యాచ్ ప్రాక్టీస్ కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలని వీరిద్దని బీసీసీఐ కోరింది. బీసీసీఐ సూచన మేరకు రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై తరుఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా కోహ్లీ కూడా దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అంగీకరించాడు. విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో ఢిల్లీ మ్యాచులకు భారీగా క్రేజ్ ఏర్పడనుంది.