టీమిండియాను కలవరపెడుతోన్న కరోనా

టీమిండియాను కలవరపెడుతోన్న కరోనా
  •     ఇంగ్లండ్​ బ్యాటింగ్‌‌‌‌ కోచ్‌‌ ట్రెస్కోతిక్‌‌కు పాజిటివ్‌‌
  •     లీసెస్టర్‌‌షైర్‌‌తో ఇండియా వామప్​ ఒక రోజు ముందుకు
  •     నేటి నుంచే ప్రాక్టీస్​ మ్యాచ్​

లీసెస్టర్​:ఇండియా–ఇంగ్లండ్‌‌ మధ్య ఐదో టెస్టును కరోనా వైరస్‌‌ కలవరపెడుతోంది. గతేడాది కూడా కరోనా కారణంగానే వాయిదా పడ్డ ఈ మ్యాచ్‌‌కు ముందు ఇరు జట్లలోనూ పాజిటివ్‌‌ కేసుల కలకలం రేగింది. ఇప్పటికే  టీమిండియా స్టార్‌‌ స్పిన్నర్‌‌ రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌ వైరస్‌‌ బారిన పడ్డాడు. దాంతో, అతను లేకుండానే టీమ్‌‌ ఇంగ్లండ్‌‌ వచ్చింది. అటు ఇంగ్లండ్‌‌ టీమ్‌‌లో ఒకరికి వైరస్‌‌ సోకినట్టు తేలింది. మరోవైపు ఇండియా మాజీ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ కూడా పాజిటివ్‌‌గా తేలినప్పటికీ.. తను  పూర్తిగా కోలుకున్నట్టు తాజాగా తెలిసింది. ఐపీఎల్‌‌ ముగిసిన వెంటనే కోహ్లీ ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్‌‌ టూర్‌‌కు వెళ్లాడు. తిరిగొచ్చిన తర్వాత పాజిటివ్​గా తేలాడని బోర్డ్​ వర్గాలు చెప్పినట్టు ఓ ఇంగ్లిష్​ పత్రిక పేర్కొన్నది. అయితే, కోహ్లీ  ఇండియాలో ఉన్నప్పుడే పాజిటివ్​గా తేలాడా? లేక ఇంగ్లండ్​ వెళ్లిన తర్వాత ఇన్​ఫెక్ట్​ అయ్యాడా? అనేదానిపై క్లారిటీ లేదు. ఈనెల 16న టీమ్​తో కలిసి తను లండన్​ వెళ్లి తర్వాతి రోజు ప్రాక్టీస్​ చేశాడు. మంగళవారం కూడా గ్రౌండ్​లో కనిపించాడు.  ఇక, లీసెస్టర్‌‌షైర్‌‌ కౌంటీ టీమ్‌‌తో టీమిండియా నాలుగు రోజుల ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌ను ఒక రోజు ముందుకు జరిపారు. శుక్రవారం మొదలవ్వాల్సిన ఈ వామప్​ గురువారం నుంచే జరగనుంది.  ఇందులో ప్లేయర్లందరినీ బరిలోకి దింపి తుది జట్టుపై అంచనాకు రావాలని హెడ్‌‌ కోచ్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌ భావిస్తున్నాడు. ఐపీఎల్‌‌ తర్వాత కెప్టెన్‌‌ రోహిత్‌‌, కోహ్లీ, షమీ, బుమ్రా ఆటకు దూరంగా ఉన్నారు. ఈ  నేపథ్యంలో ప్లేయర్లంతా వీలైనంత తొందరగా మ్యాచ్‌‌ మూడ్‌‌లోకి రావాల్సిన అవసరం ఉంది.  జులై 1–5 మధ్య బర్మింగ్‌‌హామ్‌‌లో టెస్టు మ్యాచ్‌‌ జరుగుతుంది.

మ్యాచ్ సాఫీగా సాగేనా

ఇంగ్లండ్‌‌ జట్టు బ్యాటింగ్‌‌ కోచ్‌‌ మార్కస్‌‌ ట్రెస్కోతిక్‌‌ పాజిటివ్‌‌గా తేలాడు. ఇంగ్లండ్‌‌ టూర్‌‌లో ఉన్న న్యూజిలాండ్‌‌ టీమ్‌‌లో  కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ సహా ఆరుగురు పాజిటివ్‌‌గా తేలారు. మరోవైపు యూకేలో రోజూ 10వేల పైనే కొత్త కేసులు వస్తున్నాయి. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండమని  చెప్పిన్నప్పటికీ ఆటగాళ్లు పట్టించుకోవడం లేదు.  మాస్క్ లేకుండా ఫ్యాన్స్‌‌తో ఫొటోలు దిగిన కెప్టెన్‌‌ రోహిత్‌‌, విరాట్‌‌ కోహ్లీపై ఇప్పటికే  బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాన్స్‌‌కు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.  జట్లులో ప్లేయర్లంతా వ్యాక్సిన్లు తీసుకున్నారు. రెగ్యులర్‌‌గా టెస్టులు చేస్తున్నారు. ఎవరైనా పాజిటివ్‌‌గా తేలితే మాత్రం ఐదు రోజులు ఐసోలేషన్‌‌లో ఉండాలి. అదే జరిగితే ప్లేయర్లు.. టెస్టుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. గతేడాది జట్టులో పలువురు కరోనా బారిన పడటంతో ఈ మ్యాచ్​ ఆడేందుకు ఇండియా నిరాకరించడంతో ఇప్పటికి వాయిదా పడింది.

రేపు ఇంగ్లండ్‌‌కు అశ్విన్‌‌

స్పిన్నర్‌‌ అశ్విన్‌‌ కరోనా నుంచి కోలుకున్నట్టు సమాచారం. అతను శుక్రవారం ఇంగ్లండ్‌‌ బయలుదేరతాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అయితే, వామప్​ మ్యాచ్​కు తను దూరం అవుతున్నాడు. టెస్టు టీమ్‌‌లో అతను కీలక ఆటగాడు. కానీ, ఎలాంటి వామప్‌‌ లేకుండానే అతడిని టెస్టు మ్యాచ్‌‌లో ఆడిస్తారో లేదో చూడాలి.