కోహ్లీ వంద సెంచరీల రికార్డునూ బ్రేక్‌‌ చేస్తాడు : రవిశాస్త్రి

కోహ్లీ వంద సెంచరీల రికార్డునూ బ్రేక్‌‌ చేస్తాడు : రవిశాస్త్రి

ముంబై: క్రికెట్‌‌ లెజెండ్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ వంద సెంచరీల రికార్డును బద్దలు కొట్టే సత్తా విరాట్‌‌ కోహ్లీకి ఉందని టీమిండియా మాజీ కోచ్‌‌ రవిశాస్త్రి అన్నాడు. ప్రస్తుతం విరాట్‌‌ ఉన్న ఫామ్‌‌ను చూస్తే చాలా త్వరలోనే ఆ కల కూడా నెరవేరుతుందన్నాడు. వన్డేల్లో సచిన్‌‌ (49) సెంచరీల రికార్డును బ్రేక్‌‌ చేసిన కోహ్లీ టెస్ట్‌‌ల్లో 29 సెంచరీలు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్‌‌ ఖాతాలో ఇప్పటి వరకు 80 సెంచరీలు ఉన్నాయి. 

‘సచిన్‌‌ వంద సెంచరీల రికార్డు నెలకొల్పినప్పుడు కనీసం దాని దరిదాపుల్లోకి ఎవరైనా వస్తారని ఊహించలేదు. కానీ విరాట్‌‌ వన్డే రికార్డును బ్రేక్‌‌ చేశాడు. ఇప్పుడు అతని ఖాతాలో 80 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీలాంటి ఆటగాళ్లకు ఏదీ అసాధ్యం కాదు. ఒకసారి సెంచరీల వేటలో పడితే వేగంగా వాటిని సాధిస్తారు. రాబోయే 10 ఇన్నింగ్స్‌‌ల్లో కనీసం మరో ఐదు సెంచరీలైనా చూస్తాం. కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. మరో మూడు, నాలుగేళ్లు ఈజీగా కెరీర్‌‌ను కొనసాగిస్తాడు. కాబట్టి వంద సెంచరీల రికార్డును అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు’ అని శాస్త్రి పేర్కొన్నాడు. 

గత వరల్డ్‌‌ కప్స్‌‌లో కాస్త ఇబ్బందిపడ్డ కోహ్లీ ఈ టోర్నీలో ఆడుతున్న తీరు అద్భుతమని కితాబిచ్చాడు. క్రీజులో విరాట్‌‌ కుదురుకుంటున్న తీరు సూపర్బ్‌‌ అని ప్రశంసించాడు. ఆరంభంలో కాస్త టైమ్‌‌ తీసుకున్నా, వికెట్‌‌ను కాపాడుకుంటూ, ఒత్తిడిని అధిగమిస్తూ ఇన్నింగ్స్‌‌లో తన పాత్ర ఏంటో సంపూర్ణంగా అర్థం చేసుకుని బ్యాటింగ్‌‌ చేస్తున్న తీరు ఆకట్టుకుందన్నాడు. వికెట్ల మధ్య కోహ్లీ పరుగెత్తుతున్న తీరును చూస్తే ఫిట్‌‌నెస్‌‌పై అతని శ్రద్ధ ఎంత ఉందో తెలిసిపోతుందన్నాడు. ఈ టోర్నీలో విరాట్‌‌ బ్యాటింగ్‌‌ టెక్నిక్‌‌ ఓ రేంజ్‌‌లో ఉందని శాస్త్రి వెల్లడించాడు.