ముంబై: టెస్ట్, టీ20 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన టీమిండియా స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని రోహిత్, కోహ్లీ ఇద్దరిని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ‘‘ఇండియా తరపున వన్డేలు ఆడాలనుకుంటే దేశీయ క్రికెట్ ఆడవలసి ఉంటుందని కోహ్లీ, రోహిత్‌కు బీసీసీఐ తెలియజేసింది. వారిద్దరూ టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్ కావడంతో ఫామ్, ఫిట్నెస్ -కోల్పోకుండా ఉండటానికి దేశీయ క్రికెట్ ఆడాలి’’ అని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ స్టా్ర్ జోడీ కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతోంది. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ, రోహిత్ ఆడారు. ఈ సిరీస్ లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలవగా.. కోహ్లీ మాత్రం వరుసగా రెండు మ్యాచుల్లో డకౌటై నిరాశపర్చాడు.
చివరి మ్యాచులో హాఫ్ సెంచరీతో తిరిగి టచ్‌లోకి వచ్చాడు. ఇక, కోహ్లీ, రోహిత్ 2025, నవంబర్ 30 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో మళ్లీ గ్రౌండ్లోకి దిగనున్నారు. ఈ సిరీస్ తర్వాత 2026, జనవరిలో న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లో ఆడనున్నారు. దీంతో వీరిద్దరికి కొన్ని మ్యాచులు ఆడే అవకాశం మాత్రమే ఉంది.
Also Read:-అవును నిజమే.. రెండో పెళ్లి చేసుకున్నా: సెకండ్ మ్యారేజ్‌పై రషీద్ ఖాన్ క్లారిటీ
ఈ నేపథ్యంలోనే ఫామ్, ఫిట్నెస్ కోల్పోకుండా 2025, డిసెంబర్ 24న ప్రారంభం కానున్న దేశీయ వన్డే టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని కోహ్లీ, రోహిత్‌కు బీసీసీఐ సూచించింది. ఇండియా తరుఫున వన్డే ఫార్మాట్లో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని క్లియర్ మేసేజ్ పంపినట్లు సమాచారం.
ఈ క్రమంలో ముంబై తరఫున విజయ్ హాజరై ట్రోఫీ ఆడటానికి అందుబాటులో ఉంటానని హిట్ మ్యాన్ సమాచారం పంపినట్లు తెలుస్తోంది. మరీ కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్న విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
