ఇప్పుడు ఒత్తిడంతా టీమిండియా పైనే

ఇప్పుడు ఒత్తిడంతా టీమిండియా పైనే

ఆసియా కప్  2022 విజేత పాకిస్తాన్ టీమేనని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ జోస్యం చెప్పాడు.  ఓ మీడియాతో మాట్లాడుతూ సెహ్వాగ్ ఈ  కామెంట్స్ చేశాడు. ఇవాళ సూపర్‌-4 మ్యాచ్‌ల్లో భాగంగా శ్రీలంకతో జరగబోయే మ్యాచ్‌లో ఒకవేళ టీమిండియా ఓడితే కనుక పాకిస్తాన్‌ ఆసియా కప్‌ను గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సెహ్వాగ్‌ అన్నాడు . ఆసియా కప్ లో చాలాకాలం తర్వాత  పాకిస్తాన్ ఫైనల్‌ ఆడనుందని, ఆసియా కప్‌లో  చాలా కాలం తర్వాత భారత్‌ను ఓడించడం చూస్తుంటే ఆసియా ఛాంపియన్‌గా దాయాది దేశం నిలిచే అవకాశాలున్నాయని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు.  

"శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే  టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. కానీ పాకిస్తాన్ పరిస్థితి అలా కాదు. ఆ జట్టు మిగిలిన రెండింటిలో ఒకదాంట్లో ఓడిపోయిన ఆ జట్టుకు పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే భారత్‌పై గెలిచిన తర్వాత ఆ జట్టు సాధించిన నెట్ రన్‌రేట్ ఆ టీమ్‌ని ఫైనల్‌కి తీసుకెళ్లగలదు. ఇప్పుడు ఒత్తిడి అంతా టీమిండియా  పైనే ఉంది "  అని సెహ్వాగ్‌ అంచనా వేశాడు. సెహ్వాగ్ చేసిన కామెంట్స్ ను ఫ్యాన్స్  జీర్ణించుకోలేకపోతున్నారు.  పాకిస్తాన్ ఇప్పటి వరకూ రెండు సార్లు (2000, 2012) ఆసియా కప్‌లో విజేతగా నిలిచింది. భారత్ ఏడు సార్లు, శ్రీలంక ఐదు సార్లు  ఆసియా కప్ విజేతలుగా నిలిచాయి.