
తమిళనాట మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు హరి. సామి, ఆరు, సింగం లాంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌తో మెప్పించిన హరి.. ఇప్పుడు విశాల్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. కార్తిక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థ.. జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తోంది. ఇప్పటికే విశాల్, హరి కాంబినేషన్‌లో భరణి, పూజ సినిమాలు వచ్చాయి.
ఈ రెండు చిత్రాలతో హిట్స్ అందుకున్న విశాల్, హరి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే ప్లాన్‌లో ఉన్నారు. విశాల్ కెరీర్‌లో ఇది 34వ చిత్రం. శనివారం షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ, తమ కాంబినేషన్‌లో మరో సక్సెస్ ఫుల్ సినిమా రాబోతోందని చెప్పాడు విశాల్. మెడికల్ మాఫియాకి చెందిన కథతో తెరకెక్కుతోందని పోస్టర్స్‌ను బట్టి అర్థమవుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. విశాల్, హరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పూజ’ చిత్రానికి కూడా దేవిశ్రీయే సంగీతం అందించాడు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో రివీల్ చేయనున్నారు. మరోవైపు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మార్క్ ఆంటోని’ మూవీ వినాయక చవితికి విడుదల కానుంది.