‘లాఠీ’ ఓ కానిస్టేబుల్ సాహసం

‘లాఠీ’ ఓ కానిస్టేబుల్ సాహసం

విశాల్, సునయన జంటగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రమణ, నంద నిర్మిస్తున్న చిత్రం ‘లాఠీ’. డిసెంబర్ 22న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ ప్యాన్ ఇండియా మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘విశాల్‌‌కి ఓ జబ్బు ఉంది. సినిమా బడ్జెట్‌‌ ఎంత పెరిగినా, వర్కింగ్ డేస్ ఎన్ని పెరిగినా షూటింగ్ చేయాలనే జబ్బు. అది రాజమౌళి దగ్గర నుంచి అంటుకుంది (నవ్వుతూ). మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకోవాలి’ అన్నారు. మరో గెస్ట్‌‌గా హాజరైన కార్తికేయ మాట్లాడుతూ ‘విశాల్ గారి సినిమాలు ఫాలో అవుతుంటాను.

డిఫరెంట్ మూవీస్‌‌తో స్ఫూర్తినిచ్చే హీరో’ అన్నాడు.  విశాల్ మాట్లాడుతూ ‘విజయేంద్ర ప్రసాద్‌‌ గారిని ఎప్పట్నుంచో కలవాలని కోరిక. ఆయన ఈవెంట్‌‌కి రావడం ఆనందంగా ఉంది. నా ప్రతి సినిమాలానే.. ఈ సినిమాని కూడా ఎంత మంది చూస్తారో ఒక్కొక్క టికెట్‌‌కి ఒక్కో రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను’అన్నాడు. ‘రాజరాజ చోర’ తర్వాత ఈ ప్యాన్ ఇండియా మూవీలో అవకాశం ఇచ్చిన విశాల్‌కు థ్యాంక్స్ చెప్పింది సునయన. ‘ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఒక సాధారణ కానిస్టేబుల్, అతని సాహసాలకు సంబంధించిన కథ’ అని చెప్పాడు దర్శకుడు వినోద్. విశాల్‌కి ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ వస్తుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాతలు.  నటుడు శివ బాలాజీ, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, లిరిసిస్ట్ చంద్రబోస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.