Vishal engagement: విశాల్ - ధన్షికల నిశ్చితార్థం.. నడిగర్ సంఘం భవనం సాక్షిగా ప్రేమబంధం!

Vishal engagement: విశాల్ - ధన్షికల నిశ్చితార్థం.. నడిగర్ సంఘం భవనం సాక్షిగా ప్రేమబంధం!

తమిళ సినీ నటుడు విశాల్ తన ప్రేయసి , నటి సాయి ధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ వేడుకకు పెద్దగా ఎవరినీ ఆహ్వానించలేదు. కేవలం తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా విశాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ రోజు ఉదయం 11 గంటలకు విశాల్ తన 47వ పుట్టినరోజు సందర్భంగా నిర్మాణం కొనసాగుతున్న నడిగర్ సంఘం భవనానికి వెళ్లారు. అదే స్థలంలో తన ప్రేయసి, నటి సాయి ధన్షికతో నిశ్చితార్థం చేసుకున్నారు . దీనితో, విశాల్ తన వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని నాడిగర్ సంగం భవనంతో ముడిపెట్టడం అభిమానులను మరింత ఆకట్టుకుంది.

నిశ్చితార్థం తర్వాత, విశాల్ తన అధికారిక X ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా ఈ శుభవార్తను ప్రకటించారు. "ప్రపంచం నలుమూలల నుంచి నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందించిన నా ప్రియమైన వారందరికీ ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు సాయి ధన్షికతో నా నిశ్చితార్థం జరిగిన శుభవార్తను మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను చాలా సానుకూలంగా, ఆశీర్వదించబడినట్లు భావిస్తున్నాను. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు, మంచి మనసు కోరుకుంటున్నాను" అని విశాల్ రాసుకొచ్చారు.

తమిళ సినీ నటుడు, నిర్మాత విశాల్ తన ప్రేమను, వివాహాన్ని నడిగర్ సంఘం భవనంతో ముడిపెట్టిన విషయం తెలిసిందే. తాను అధ్యక్షుడిగా ఉన్న ఈ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటించారు. అయితే, తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ, భవనం పూర్తి కాకుండానే, విశాల్ నిశ్చితార్థం చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ శుభ సందర్భం తమిళ సినీ వర్గాల్లో, అభిమానులలో సంతోషాన్ని నింపింది. విశాల్ వివాహం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక ఊరటనిచ్చింది.  త్వరలోనే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటూ, ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.