గోవా సీఎంపై వీడని సస్పెన్స్    

గోవా సీఎంపై వీడని సస్పెన్స్    
  •     ఉత్తరాఖండ్, మణిపూర్ లోనూ సీఎం క్యాండిడేట్లను తేల్చని బీజేపీ 

పనాజీ/న్యూఢిల్లీ/చండీగఢ్: గోవాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా సీఎం ప్రమోద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైని కలిసి రిజైన్ లెటర్ అందజేశారు. గవర్నర్ తన రాజీనామాను ఆమోదించారని, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారని సావంత్ చెప్పారు. అయితే, గోవా కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ హైకమాండ్ మళ్లీ సావంత్ కే అవకాశం ఇస్తుందా? లేక కొత్త నేతను ఎంపిక చేస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.  మరోవైపు సీఎం పదవికి పోటీ పడుతున్న బీజేపీ నేత విశ్వజిత్ రాణే శనివారం గోవా గవర్నర్​ శ్రీధరన్ పిళ్లైను కలిశారు. అయితే, తాను వ్యక్తిగతంగానే గవర్నర్ ను  కలిశానని, ఇందులో రాజకీయం ఏమీ లేదని ఆయన చెప్పారు. గోవాతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ కు కేంద్ర పరిశీలకులు వెళ్తారని.. ఆ తర్వాతే ప్రమాణస్వీకార తేదీలు ప్రకటిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు.  

హోలీ తర్వాతే యోగి ప్రమాణం..   

యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఢిల్లీలో ప్రధాని మోడీ, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలవనున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయడం దాదాపుగా ఖరారైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం హోలీ  తర్వాతే నిర్వహించనున్నారు.   

భగత్ సింగ్ సొంతూరులో మన్ ప్రమాణం..  

పంజాబ్ కు కాబోయే సీఎం, ఆప్ ఎమ్మెల్యే భగవంత్ మన్ శనివారం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలిశారు. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరినట్లు చెప్పారు. ఈ నెల 16న భగత్ సింగ్ సొంతూరు ఖట్కర్ కలన్ లో మధ్యాహ్నం 12:30కు ప్రమాణస్వీకారం చేస్తానని గవర్నర్ కు తెలియజేసినట్లు భగవంత్ మన్ తెలిపారు.