అన్ని శాఖల నుంచి విజన్ డాక్యుమెంట్..పకడ్బందీగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రూపకల్పన

అన్ని శాఖల నుంచి విజన్ డాక్యుమెంట్..పకడ్బందీగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రూపకల్పన
  •     ఇప్పటికే నిపుణులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరణ
  •     అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు 
  •     డిసెంబర్‌‌ 9న డాక్యుమెంట్ విడుదల చేసే చాన్స్‌

హైదరాబాద్, వెలుగు: 2047 నాటికి తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం.. అందుకోసం ‘తెలంగాణ రైజింగ్‌ – 2047’ పేరుతో విజన్ డాక్యుమెంట్‌ రూపొందిస్తున్నది. దీని రూపకల్పనలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులు, ఆర్థికవేత్తలు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ తయారీకి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల నుంచి నివేదికలు, ప్రణాళికలు కోరుతున్నది. ఈ నివేదికల ఆధారంగా ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్‌ రూపొందించనుంది.  ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారమే అన్ని అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, పెట్టుబడులు ఉండేలా కసరత్తు చేస్తున్నది. దీనివల్ల నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.
  
అన్ని రంగాలపై ఫోకస్.. 

తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌‌ ముసాయిదాను  సెప్టెంబర్ 15 కల్లా తయారు చేసి, నవంబర్ చివరి కల్లా ఫైనల్ చేసి, డిసెంబర్ 9న విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ డాక్యుమెంట్ కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే ఒక రోడ్‌‌మ్యాప్‌‌లా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు విద్య, ఆరోగ్యం, సంక్షేమం తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్​డీపీ) పెంపు, పారిశ్రామికీకరణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు వంటి అంశాలతో పాటు ఐటీ, ఫార్మా రంగాలను బలోపేతం చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పరిపాలనా సంస్కరణలు, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు కూడా ఇందులో భాగం కానున్నాయి.  

ఎప్పటికప్పుడు సీఎం సమీక్ష... 

‘వికసిత భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్‌‌–2047’ డాక్యుమెంట్‌‌ను రూపొందిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీని అమలుకు కేంద్రం సహకరించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన కోరారు. హైదరాబాద్‌‌ను హెల్త్ టూరిజం, సినిమా పరిశ్రమల హబ్‌‌గా మార్చడానికి ప్రత్యేక ప్రణాళికలు ఈ డాక్యుమెంట్‌‌లో ఉంటాయని సీఎం తెలిపారు. గిగ్ కార్మికులకు చట్టబద్ధమైన గుర్తింపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త కోర్సులు ప్రారంభం వంటివి కూడా ఈ ప్రణాళికలో భాగం కానున్నాయి. కాగా 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చాలనే లక్ష్యంపై బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి ప్రశంసలు కురిపించారు.