రెండో తరగతిలోనే చూపు కోల్పోయిన అంధురాలికి సివిల్స్

రెండో తరగతిలోనే చూపు కోల్పోయిన అంధురాలికి సివిల్స్

శరీరంలో అన్ని అవయవాలు బాగున్నా.. సివిల్స్ సాధించాలంటే ఎంతో కఠోర శ్రమ అవసరం. అటువంటిది చూపు లేకుండా సివిల్స్ సాధించడమంటే మాటలు కాదు. ఒడిశాకు చెందిన తపస్విని దాస్ అనే అంధురాలు , ఆ రాష్ట్రం నిర్వహించే ఒడిశా సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌ని రాసి సివిల్స్ పాసైంది. OPSC 2018లో నిర్వహించిన ఈ పరీక్షలో దాస్ 161 స్థానాన్ని దక్కించుకుంది. ఈ పరీక్షకు ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయితే, అందులో 218 మంది మాత్రమే అర్హత సాధించారు.

భువనేశ్వర్‌కు చెందిన దాస్‌కు చిన్నతనంలో కంటిచూపు సమస్య ఉండేది. డాక్టరును సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు దాస్ రెండవ తరగతి చదువుతుంది. అయితే ఆపరేషన్ సమయంలో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా దాస్ తన చూపును కోల్పోయింది. ‘నేను ఏడేళ్ళ వయసులో ఉన్నప్పుడు నాకు బాగా తలనొప్పి వచ్చేది. దాంతో మా కుటుంబ సభ్యులు నన్ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే నా కంటి చూపు క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. డాక్టర్ నన్ను పరీక్ష చేసి.. ఎడమ కంటిచూపు కోల్పోయానని మరియు కుడి కంటిచూపు పాక్షికంగా కోల్పోయానని చెప్పారు. కుడి కన్నుకు ఆపరేషన్ చేస్తే చూపు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ సమయంలో డాక్టర్ నిర్లక్ష్యం వహించడంతో కుడి కంటిచూపును కూడా కోల్పోయాను’ అని దాస్ తెలిపారు.

సివిల్స్‌లో సాధించిన విజయం గురించి ఆమె మాట్లాడుతూ… ‘నేను దీనిని సక్సెస్‌గా భావించను, ఇది నా విజయంగా భావిస్తాను. విజయపథంలో ఇది నా మొదటి అడుగుగా నేను భావిస్తున్నాను ’అని దాస్ అన్నారు. అంధురాలైన దాస్ సివిల్స్ సాధించినందుకు.. ఒడిశా వికలాంగుల కమిషనర్ సులోచన దాస్ ఆమెను ప్రశంసించారు. ఒడిశాలో ఒక అంధురాలు సివిల్స్ సాధించడం ఇదే మొదటిసారని ఆమె అన్నారు. ఒడిశాలో సివిల్ సర్వీసెస్‌లో చేరిన మొదటి అంధురాలిగా దాస్ తన పేరును నమోదు చేసుకున్నారని సులోచన అన్నారు. దాస్ విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సులోచన పేర్కొన్నారు.