కాకా 75 వేల మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించిన్రు

కాకా 75 వేల మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించిన్రు
  • కాకా జీవితం అందరికీ ఆదర్శం: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగుహైదరాబాద్, సికింద్రాబాద్​ జంట నగరాల్లో ఇండ్లులేని 75 వేల మందికి స్థలాలు ఇప్పించిన గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి అని.. జీవిత చరమాంకం వరకు ఆదర్శవంతమైన జీవితం గడిపారని ఆయన కుమారుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గుర్తు చేసుకున్నారు. సోమవారం కాకా 91వ జయంతి సందర్భంగా వివేక్​ నివాళి అర్పించారు. ప్రైవేటు రంగంలో పెన్షన్లు కల్పించిన ఘనత కాకాదేనని వెల్లడించారు. రామగుండం ఫెర్టిలైజర్  కంపెనీ పునప్రారంభానికి కాకా ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నామని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాజకీయంగా, వ్యాపారంలో, వ్యక్తులుగా విలువలతో ఎలా బతకాలో కాకా తమకు నేర్పించారని వివేక్​ గుర్తు చేసుకున్నారు.

1992 ఆర్థిక సంస్కరణల టైమ్ లో అప్పటి ప్రధాని పీవీని, ఫైనాన్స్​ మినిస్టర్​ మన్మోహన్ సింగ్​ను కన్విన్స్ చేసి..  గ్రామీణాభివృద్ధి కోసం ఏకంగా రూ.25 వేల కోట్లను కాకా మంజూరు చేయించారని చెప్పారు. ఇప్పుడు భారత్ నిర్మాణ్ లో రూ.48 వేల కోట్లు ఇస్తున్నట్టుగా అప్పట్లో ఆ నిధులు మంజూరు చేయించారని తెలిపారు. సింగరేణి కోల్ మైన్స్ రీఓపెనింగ్, కోల్ వర్కర్స్ పెన్షన్ స్కీమ్ ఇవన్నీ కాకా కృషి వల్లే జరిగాయన్నారు. సింగరేణి బీఐఎఫ్ఆర్ లో ఉన్నప్పుడు పీవీ ప్రధానిగా ఉన్నారని.. ఎన్టీపీసీ నుంచి సింగరేణికి లోన్ ఇప్పించి, బీఐఎఫ్ఆర్ లిస్టు నుంచి తొలగించేలా కాకా కృషి చేశారని వివేక్  గుర్తు చేశారు. రామగుండం ఎఫ్ సీఐ రీఓపెనింగ్ లోనూ కాకా ప్రయత్నం ఉందని.. యుపీఏ ప్రభుత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ తో కాకా మాట్లాడి ఒప్పించారని తెలిపారు. ఇప్పుడు ఎఫ్​సీఐ ఓపెన్ అవుతోందంటే.. ఆ రోజుల్లో కాకా చేసిన కృషే కారణమన్నారు. కాకా ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. కాకా సరిగా చదువుకోలేదని.. కానీ పేదలు బాగా చదువుకోవాలన్న గొప్ప ఆలోచనతో అంబేద్కర్ విద్యా సంస్థలు నెలకొల్పారని వివేక్​ తెలిపారు. పేదలకు నాణ్యమైన ఎడ్యుకేషన్​ అందించాలన్న ఉద్దేశంతో డొనేషన్ లేకుండా 40 ఏళ్లుగా విద్యా సంస్థలు నడుపుతున్నట్టు వివరించారు. కాకా ఆశయాలను కొనసాగించేందుకు దేవుడు తమకు మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు వివేక్​ చెప్పారు.