బీజేపీ కొత్త కార్యవర్గంలో వివేక్ వెంకటస్వామి, ఈటలకు కీలక పదవులు 

బీజేపీ కొత్త కార్యవర్గంలో వివేక్ వెంకటస్వామి, ఈటలకు కీలక పదవులు 

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మరియు హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లకు కీలక పదవి వరించింది. వీరితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలకు కీలక పదవులు దక్కాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా ప్రకటించారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ ప్రత్యేక ఆహ్వానితులు, శాశ్వత ఆహ్వానితుల (ఎక్స్ అఫిషియో)తో జాబితాను  ప్రకటించారు.

నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నాయకులు ఎల్.కే అద్వానీ, డాక్టర్ మురళి మనోహర్ జోషి, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ నేషనల్ ఆఫీస్ బేరర్స్ తో సహా 80 మంది సభ్యులు ఉన్నారు.

నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, గరికపాటి రామ్మోహన్ రావులకు చోటు లభించగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి కన్నా లక్ష్మినారాయణకు స్థానం లభించింది. జాతీయ ఆఫీస్ బేరర్లులలో తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను నియమించగా.. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది. జాతీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుండి సత్యకుమార్ కు చోటు దక్కగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుండి విజయశాంతి, ఈటల రాజేందర్ లకు స్థానం దక్కింది.