కామారెడ్డి జిల్లా : మునుగొడులో ఉప ఎన్నిక వస్తదనే భయంతో.. సీఎం కేసీఆర్ ఇతర పార్టీల లీడర్లను కొంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ కు 10 సీట్లు కూడా రావని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేసే బాధ్యత ఓటర్లదేనని తెలిపారు. ‘‘టీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. రాష్ట్రంలో రానున్నది బీజేపీ సర్కారే’’ అని పేర్కొన్నారు. గ్రామాల్లో బీజేపీ నేతలను అడ్డుకోవటం సిగ్గు చేటు.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కొడిచెర్లలో మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే అరుణతార మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు చేయించి, చర్యలు తీసుకుంటామని వివేక్ వెంకటస్వామి అన్నారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిబంధనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని తెలిపారు. తప్పుడు డిజైన్ వల్ల లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వరద పాలైందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ ను ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం జలాలతో నిజాంసాగర్ ప్రాజెక్టును నింపుతామని కేసీఆర్ అబద్ధం చెప్పారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా.. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. డబుల్ బెడ్ రూం, దళిత బంధు, నిరుద్యోగ భృతి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని టీఆర్ఎస్ సర్కారును ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడంతో ప్రజలు ఎంతో ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ప్రజా గోస- బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. జుక్కల్ లో ఒక్క పైసా అభివృద్ధి కూడా జరగలేదన్నారు. ‘‘జీఎస్టీ రేట్ల నిర్ణయంలో కేంద్ర ఆర్థిక మంత్రి పాత్ర చాలా తక్కువ. జీఎస్టీ మండలిలో ఉన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఒప్పుకుంటేనే జీఎస్టీ రేట్లు నిర్ణయం అవుతాయి’’ అని చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అరుణతార మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 10 రోజులుగా గ్రామగ్రామాన తిరుగుతుంటే చాలా సమస్యలున్నట్లు ప్రజలు చెప్పారని తెలిపారు.
