స్క్రిప్ట్ రైటర్గా కేసీఆర్ ఫెయిల్ అయిండు : వివేక్ వెంకటస్వామి

స్క్రిప్ట్ రైటర్గా  కేసీఆర్ ఫెయిల్ అయిండు : వివేక్ వెంకటస్వామి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా వ్యవహారంపై  మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి స్పందించారు.  ప్రజలను‌ డైవర్ట్ చేయడానికి సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారన్నారు.  ‘‘ఆ నలుగురు ఎమ్మెల్యే లు మళ్లీ గెలిచేవాళ్లు కాదు. నాటకం వేసి సెన్షేషన్ చేద్దామనుకున్నడు.  స్క్రిప్ట్ రైటర్ గా సీఎం కేసీఆర్ ఫెయిల్ అయిండు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై  సీబీఐ ఎంక్వైరీ చేసి, సీఎం కేసీఆర్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  బుధవారం రాత్రి V6 న్యూస్ తో వివేక్ మాట్లాడారు.

‘‘ బీజేపీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలను కొనలేదు. మధ్యప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వస్తామంటే రాజీనామా చేసిన తర్వాతనే రావాలని పార్టీ చెప్పింది. అప్పుడు వాళ్లంతా రాజీనామా చేశాకే పార్టీలోకి వచ్చారు. భారీ మెజారిటీతో అందరు ఎమ్మెల్యేలు గెలిచారు’’ అని వివేక్ గుర్తుచేశారు. ‘‘14 మంది టీఆర్ఎస్ మంత్రులు మునుగోడుకు వచ్చి పని చేసిన తర్వాత కూడా.. అక్కడి ప్రజలు ఓపెన్ గా బీజేపీ అభ్యర్థి  రాజగోపాల్ రెడ్డినే గెలిపిస్తామని చెప్తున్నారు. అన్ని సర్వే రిపోర్ట్ లు కూడా అదే చెప్తున్నాయి’’ అని తెలిపారు. ‘‘ రాత్రిపూట మందు పోసినవాళ్లను కేసీఆర్ ఎంపీ చేసిండు. తెలంగాణ గురించి‌ కొట్లాడిన ఉద్యమకారుల గురించి మర్చిపోయి కేవలం కుటుంబ సభ్యులను కేబినెట్ మంత్రులుగా చేసుకున్నడు.  టిటిడి బోర్డులో కూడా నలుగురు కుటుంబ సభ్యులను పెట్టించాడు’’ అని ఆయన కామెంట్ చేశారు.