బీజేపీ హయాంలోనే దళితులకు పెద్దపీట

బీజేపీ హయాంలోనే దళితులకు పెద్దపీట

దళితులు ముఖ్యమంత్రి అయితే దళితులకు న్యాయం జరుగుతుందని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘కేసీఆర్ నన్ను వాడుకున్నారు.. అలాగే ఇప్పుడు దళితులను వాడుకుంటున్నారు.. కేసీఆర్ దళితులకు రూ.50 వేల కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నారు.. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు గాలికి వదిలేశారు. మాట మార్చారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు పదవులు ఇవ్వకుండా కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ దళితులకు వ్యతిరేకం కానే కాదని స్పష్టం చేశారు. కేసీఆరే దళిత వ్యతిరేకిలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఘట్కేసర్ లోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఈసందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బాగా జరుగుతోందన్నారు. 

ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో.. 

ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ సర్కారులో ముగ్గురు మహిళలకు పదవులు ఇవ్వడమే .. బీజేపీ పారదర్శక వైఖరికి నిదర్శనమని చెప్పారు. కేంద్రంలోనూ దళిత వర్గానికి చెందిన 12 మందికి మంత్రి పదవులు దక్కాయని గుర్తుచేశారు. బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని వివేక్ కొనియాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో జాయిన్ అవ్వడం ఆనందం కలిగించిందని తెలిపారు.  మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కు మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య, ఎమ్మెల్యే రఘునందన్  తదితరులు పాల్గొన్నారు.