కరీంనగర్ లండన్ అయ్యిందా..?

కరీంనగర్ లండన్ అయ్యిందా..?

కరీంనగర్ ను లండన్ చేస్తా అని సీఎం కేసీఆర్ చెప్పారు. అయిందా? అని ప్రశ్నించారు బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి. మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం కరీంనగర్ లో మాట్లాడారు వివేక్. “ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నారు. ఏమైంది?. మెగా కృష్ణారెడ్డి కోసమే మిషన్ భగీరథ పథకం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్లు పొందారు.  కమిషన్లు సంపాదించి ఎన్నికల్లో అదే డబ్బుతో గెలవాలన్నది కేసీఆర్ ఆలోచన.

కరీంనగర్ మున్సిపాలిటీకి నిధులిస్తామని హామీ ఇచ్చి ఎందుకు ఇవ్వడం లేదు. 14వ ఫైనాన్స్ నిధులు, కేంద్ర నిధులు తప్ప రాష్ట్రం ఇచ్చింది ఏమీ లేదు. స్మార్ట్ సిటీ కింద కేంద్రం కరీంనగర్ కు అధిక నిధులిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్ రూం ఇళ్లకు కూడా నిధులొచ్చాయి. నరేంద్ర మోడీ ఫొటో పెట్టాల్సి వస్తోందనే ఇళ్లు ప్రారంభించడం లేదు. ఆయుస్మాన్ భవ ద్వారా 5 లక్షల వరకు పొందే అవకాశమున్నా మోడీకి పేరు వస్తుందని అమలు చేయడం లేదు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగానే ఫెయిలయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అవుతారట. ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం మరింత వెనక్కు పోతుంది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 7 సీట్లు ఓడిపోయింది.

తుగ్లక్ లాగా ఎర్రమంజిల్ కూలగొడతానంటున్నాడు. రాత్రి ఆలోచన వస్తే పొద్దున సెక్రటేరియట్ కూల్చేస్తానంటాడు. రాష్రమేమో గానీ కల్వకుంట్ల కుటుంబం బంగారం అయింది. మా కుటుంబసభ్యులు రాజకీయాల్లోకి రారని ఉద్యమ సమయంలో చెప్పి ఇప్పుడు మాట తప్పాడు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పడమే కాకుండా రెండోసారి కొడుకును మళ్లీ సీఎం చేయాలనుకుంటున్నాడు. సీఎం దళిత ద్రోహీ. 25 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్నారు. మరో 25 మంది సమ్మె సమయంలో బస్సు ప్రమాదాల్లో చనిపోయారు. ఓడిపోయిన వినోద్ కు ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ చేశారు. టీటీడీలో ముగ్గురు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. కవితను రాజ్యసభకు పంపుతాడట. ఇవన్నీ ఎన్నికల్లో ప్రజలకు చెబుతాం. సీఏఏ విషయంలో సీఎం ఎందుకు మజ్లిస్ కు మద్ధతునిస్తున్నాడో అర్థం కావడం లేదు.

సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎన్.పి.ఆర్ లో వివాదస్పద వివరాలున్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎన్నార్సీ 1950లోనే వచ్చింది. ఇది కొత్తదేం కాదు. అస్సాంలో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే ఎన్నార్సీ అమలవుతోంది. ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారు. అన్ని ముస్లిం దేశాల్లోనూ ఇలాంటి చట్టాలున్నాయి. అక్రమ చొరబాటు దారులను అరికట్టేందుకు సీఏఏ అవసరం. బీజేపీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. హుజూర్ నగర్ లో ఓటుకు 5 వేలు కట్టి టీఆర్ఎస్ గెలిచింది. డబ్బులకు ఆశపడి ప్రజలు ఓటును అమ్ముకోవద్దు. సింగిల్ టెండర్ లో స్మార్ట్ సిటీ పనులు ఇవ్వడం సరికాదు”అని తెలిపారు వివేక్ వెంకటస్వామి.