డిస్కవరీ ఛానెల్లో కాళేశ్వరం వీడియో ఎందుకు మాయమైంది

డిస్కవరీ ఛానెల్లో కాళేశ్వరం వీడియో ఎందుకు మాయమైంది

జయశంకర్ భూపాలపల్లి: సీఎం కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకుని అవినీతిలో నెంబర్ వన్ అయ్యిండని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఫామ్ హౌస్ కోసమే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నడని ఆరోపించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ఊసు ఎందుకు ఎత్తలేదని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. మందు, డబ్బు పంచి టీఆర్ఎస్ శ్రేణులను కాళేశ్వరం పర్యటనకు పంపి అద్భుతమని చెప్పుకుంటున్న కేసీఆర్.. ఆ ప్రాజెక్టు ద్వారా ఒక్క బొట్టు నీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రెండేళ్ల క్రితం డిస్కవరీ ఛానెల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీడియోలు పెట్టిచ్చిన సీఎం.. ఇప్పుడు ఎందుకు తీసేయించారని వివేక్ ప్రశ్నించారు.

సాంకేతిక నిపుణులను సంప్రదించకుండానే ఫాంహౌస్ లో కూర్చొని కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ రాంగ్ డిజైన్ చేశారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అందుకుగానూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో 16లక్షల ఇండ్లు మంజూరుకాగా.. కేసీఆర్ ఆ నిధులను కాళేశ్వరానికి మళ్లించి దోచుకున్నడని ఆరోపించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందనడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన దాడే నిదర్శనమని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.