కేసీఆర్​కు టైం దగ్గరపడ్డది: వివేక్ వెంకటస్వామి

కేసీఆర్​కు టైం దగ్గరపడ్డది: వివేక్ వెంకటస్వామి

ఈ నియంతృత్వ పాలన త్వరలోనే ముగుస్తది 

ఎంపీ సంజయ్​పై పోలీసుల దాడి దారుణం

కోర్టుకు కూడా తప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నరు

ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేస్తామని వెల్లడి

రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, పోలీసు రాజ్యం, నిజాం సర్కార్ పాలన కనిపిస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల పట్ల టీఆర్ఎస్​ సర్కారు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని విమర్శించారు. శుక్రవారం కరీంనగర్​లో ఆర్టీసీ డ్రైవర్​ బాబు అంతిమయాత్ర సందర్భంగా జరిగిన పరిణామాలపై వివేక్​ మాట్లాడారు. ఎంపీ బండి సంజయ్​పై పోలీసులు చేసిన దాడిని ఖండించారు. ‘‘నిజాం కూడా స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిపై పోలీసులను ఉసిగొల్పి, జులుం చేసి ప్రజలను హింస పెట్టాడు. అదే పాలన ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కనబడుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. మొన్న సరూర్ నగర్​లో జరిగిన మీటింగ్ ను చూసి ప్రజలంతా ఆర్టీసీ కార్మికులవైపు ఉన్నారని సీఎంకు తెలిసొచ్చింది. అందుకే ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. ఎంపీపై దాడులు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదు. సరైన చర్యలు తీసుకుంటది. నీ పని ముగిసే టైం తొందరగానే వస్తది’’అని వివేక్​ పేర్కొన్నారు.

కోర్టుకూ అబద్ధాలు చెప్తున్నరు

పోలీసులను వాడుకుని ఆర్టీసీ కార్మికులను, ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారని వివేక్​ ఆరోపించారు. అంతా కలిసి ఆర్టీసీ కార్మికుల ఉద్యమాన్ని ఇంకా తీవ్ర తరం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్​ అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు 50 వేల జీతాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని, వాళ్ల జీతాలేమో సగటున 20 వేలేనని చెప్పారు. ఆర్టీసీకి పైసలు ఇచ్చేది లేదని హైకోర్టుకు కూడా నివేదిక ఇచ్చారని, ఇలా తప్పుడు అఫిడవిట్ పెట్టినందుకు కేసీఆర్​  కు తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. అధికారుల తీరును తప్పుపడుతూ హైకోర్టు చేసిన కామెంట్లు సర్కారు తీరును ఎండగడుతున్నాయని చెప్పారు.