కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు..కమీషన్ల కోసమే కట్టారు

కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు..కమీషన్ల కోసమే కట్టారు

కాకా వెంకటస్వామి ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టకుండ..  కమీషన్ల కోసం  సీఎం కేసీఆర్  కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో  వేల ఎకరాల్లో  పంటలు మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టు అని మండిపడ్డారు.  ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కేటాయించాలని డిమాండ్ చేశారు. 

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో నీట మునిగిన పంటలను  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్  పరిశీలించారు. ఈ సందర్భంగా  కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నాలుగేళ్లుగా  పంటలు మునుగుతున్నాయని..వివేక్ వెంకటస్వామితో రైతులు గోడు వెళ్లబోసుకున్నారు.  ఎమ్మెల్యే బాల్క సుమన్ తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాళేశ్వరం బ్యారేజీల వలన ప్రతీ ఏడాది తమ కష్టం నీళ్లపాలు అవుతుందని మహిళా రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు.