పార్టీలకు అతీతంగా మాలలంతా ఒక్కటి కావాలి: వివేక్ వెంకటస్వామి

పార్టీలకు అతీతంగా మాలలంతా ఒక్కటి కావాలి: వివేక్ వెంకటస్వామి

ఖైరతాబాద్, వెలుగు: పార్టీలకు అతీతంగా మాలలంతా ఒక్కటి కావాలని, తమ హక్కుల కోసం పోరాడాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం కోఠిలోని జాంబాగ్ లో జాతీయ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపకుడు ఆవుల బాలనాథం 77వ జయంతి, మాలల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘దళితులు ఎంత ఎదిగినా ఇప్పటికీ వివక్ష చూపిస్తున్నారు. అందుకే దళితులంతా ఏకమవ్వాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైర్యంగా నిలదీయాలి. లేకపోతే నష్టపోతారు. దళితుల కోసం ఎవరూ కొట్లాడరు. మన సమస్యలపై మనమే కొట్లాడాలి. దళితులు ఐక్యంగా ఉన్నప్పుడే రాజకీయ పార్టీలు గానీ, నాయకులు గానీ గుర్తిస్తారు” అని ఆయన అన్నారు. దళితుల అభివృద్ధి కోసం బాలనాథం ఎంతో కృషి చేశారని చెప్పారు. దళితుల సమస్యలపై ఆయన చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ‘‘ధైర్యానికి మారు పేరు బాలనాథం. ఆయన ఒక  వ్యక్తి కాదు శక్తి” అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం  మాలలను చిన్నచూపు చూస్తోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మండిపడ్డారు. మాలల సంక్షేమం కోసం వివేక్ వెంకటస్వామి ఎంతో చేస్తున్నారని, ఆయన దళితులందరికీ ఆదర్శమన్నారు. కాగా, ఈ సందర్భంగా జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామిని, అంబేద్కర్ రాష్ట్రీయ ఏక్తామోర్చా అధ్యక్షుడు భవనాథ్ పాశ్వాన్ ను సత్కరించారు. 

అంబేద్కర్ వల్లే దళితుల అభివృద్ధి: గోరటి 

అంబేద్కర్ వల్లే వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. మాలల అభ్యున్నతికి కాకా వెంకటస్వామి, బాలనాథం చేసిన కృషి మరువలేనిదన్నారు. కాకా, శంకరన్, గద్దర్ లాంటి ఎంతో మంది ఆణిముత్యాలు మాల జాతిలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో మాలలు బాగా చైతన్యంతో ఉంటారని, రాజకీయంగా ఇంకా ముందుకు పోవాలని అంబేద్కర్ రాష్ట్రీయ ఏక్తామోర్చా అధ్యక్షుడు భవనాథ్ పాశ్వాన్ అన్నారు. మాలల ఐక్యత కోసం కాకా వెంకటస్వామి తర్వాత ఆ స్థాయిలో పని చేసిన వ్యక్తి బాలనాథం అని గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అన్నారు. విద్యతో పాటు ఆర్థికంగా బలపడితేనే మాలలు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ అన్నారు. కార్యక్రమంలో జాతీయ మాలల ఐక్య వేదిక అధ్యక్షుడు కరణం బాలకిషన్, ఉపాధ్యక్షుడు ఆవుల సుధీర్, మందాల భాస్కర్, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.