బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తెలిసే పార్టీ వీడిన : వివేక్ వెంకటస్వామి

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తెలిసే పార్టీ వీడిన : వివేక్ వెంకటస్వామి
  • వేల కోట్లు దండుకున్న కవిత, కేసీఆర్, బాల్క సుమన్​పై ఐటీ దాడులేవీ?: వివేక్ వెంకటస్వామి
  • కేసీఆర్ అవినీతిపై పదిసార్లు ఫిర్యాదు చేసినా అమిత్ షా పట్టించుకోలె
  • పార్టీ మారినందుకే నాపై దాడులు చేస్తున్నరు
  • కాంగ్రెస్ సర్కార్ రాగానే కేసీఆర్, బాల్క సుమన్​ను జైలుకు పంపిస్తామని కామెంట్

కోల్ బెల్ట్, వెలుగు: వేల కోట్ల దోపిడీ చేసినోళ్లను వదిలేసి.. చట్ట ప్రకారం పన్నులు కడుతున్న తమపై దాడులు చేస్తున్నారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కాళేశ్వరంతో కేసీఆర్, లిక్కర్ దందాతో కవిత, ఇసుక దందాతో బాల్క సుమన్ వేల కోట్లు దండుకుంటే.. వాళ్లపై ఐటీ, ఈడీ దాడులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. శనివారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వివేక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని తెలిసే బీజేపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. బీజేపీని వీడిన నాలుగు రోజులకే తనపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయని పేర్కొన్నారు. బీజేపీలో ఉంటే సీతను, పార్టీ వీడితే రావణుడిని అయ్యానా? అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని పదిసార్లు అమిత్ షాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ చెన్నూర్​లో ఇసుక దందాతో వేల కోట్లు కొల్లగొట్టిన బాల్క సుమన్ ఇచ్చిన చిన్న ఫిర్యాదుతో నాపై దాడులు చేశారు. కేసీఆర్, అమిత్ షా కుమ్మక్కై ఫిర్యాదు అందిన 48 గంటల్లోనే నాపై ఐటీ, ఈడీ దాడులు చేయించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని చెప్పడానికి ఇదే నిదర్శనం” అని అన్నారు. అమిత్ షాకు దమ్ముంటే.. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ‘‘నా వ్యాపారాలన్నీ చట్టం ప్రకారం నడుస్తున్నయ్. ఇప్పటి వరకు నేను రూ.10 వేల కోట్ల పన్ను కట్టాను. ఇందుకుగాను మా సంస్థ విశాక ఇండస్ట్రీస్ కు ఐటీ శాఖ బెస్ట్ అవార్డు ఇచ్చింది. అలాంటి మా సంస్థలపై రెయిడ్స్ చేయడమేంటి?” అని ప్రశ్నించారు.

కేసీఆర్ పైనే ఫెమా కేసు పెట్టాలె..

ఫేక్ పాస్ పోర్టులు సృష్టించి మానవ అక్రమ రవాణా చేసిన కేసీఆర్ ను వదిలేసి, తనపై ఫెమా ఆరోపణలు చేయడమేంటని వివేక్ ప్రశ్నించారు. కేసీఆర్ పై ఫెమా కేసు పెట్టి, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాతో వేల కోట్లు దండుకున్న బాల్క సుమన్​పైనా విచారణ జరిపించి జైలుకు పంపించాలన్నారు. ‘‘చెన్నూర్ లో ఇసుక దందా ద్వారా వేల కోట్లు దండుకున్న బాల్క సుమన్ ఎంత పన్ను కట్టిండో దర్యాప్తు సంస్థలు ప్రజలకు చెప్పాలి. ఒక్కటే వే బిల్ తో 200 లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలను బాల్క సుమన్ తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నూర్ నుంచి తరలించిన ఇసుక, ప్రభుత్వానికి కట్టిన పన్నుల లెక్కలు పరిశీలిస్తే బాల్క సుమన్ బాగోతం బయటపడుతుంది. అవినీతి కేసీఆర్, బాల్కసుమన్ వల్ల ప్రజలకు దమ్మిడి ఉపయోగం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీళ్లిద్దరిపై విచారణ చేసి జైలుకు పంపిస్తాం” అని చెప్పారు. బాల్క సుమన్ కు ప్రజలు, సొంత కార్యకర్తల కన్నా ఇసుక దందా, కాంట్రాక్టర్లే ముఖ్యమని విమర్శించారు. ఇసుక దందాతో బాల్క సుమన్ తన సూట్ కేసు నింపుకుంటే, కేసీఆర్ తన దోపిడీతో తెలంగాణను అప్పులపాలు చేశారని ఫైర్ అయ్యారు.

బాల్క సుమన్ వల్ల ఆగమైనం: చిరు వ్యాపారులు

 
బాల్క సుమన్ వల్ల తమ బతుకులు ఆగమయ్యాయని చిరు వ్యాపారులు వాపోయారు. వివేక్ దగ్గర తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘‘మాకు జీవనాధారమైన షాపులను రోడ్డు వెడల్పు పేరుతో బాల్క సుమన్ తొలగించారు. చెన్నూర్ టౌన్ లోని జలాల్ పెట్రోల్ బంక్ నుంచి పాత ఎమ్మార్వో ఆఫీసు వరకు రోడ్డు వెడల్పు చేయాలని.. రోడ్డుకు ఇరువైపులా 150 షాపులను తొలగించారు. నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ మూడేండ్లుగా పట్టించుకోవడం లేదు. ఉన్న ఉపాధి పోవడంతో కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడుతున్నం” అని బాధితులు వాపోయారు.