రాష్ట్రాన్ని అప్పుల్లో, అవినీతిలో నంబర్ వన్ చేసిన్రు

రాష్ట్రాన్ని అప్పుల్లో, అవినీతిలో నంబర్ వన్ చేసిన్రు
  • సీబీఐ అంటేనే.. కేసీఆర్ ఫ్యామిలీ వణుకుతోంది
  • రాష్ట్రాన్ని అప్పుల్లో, అవినీతిలో నంబర్ వన్ చేసిన్రు: వివేక్ వెంకటస్వామి
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో దోషులకు శిక్ష ఖాయం 
  • గిరిజన రిజర్వేషన్ల పేరిట మళ్లీ మోసం 
  • కేసీఆర్ కు ఓట్లతో బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపు 

మహబూబాబాద్/నెల్లికుదురు/తొర్రూరు, వెలుగు: సీబీఐ అంటేనే సీఎం కేసీఆర్ కుటుంబానికి వణుకు పుడుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో, అవినీతిలో నంబర్ వన్ గా కేసీఆర్ మార్చారని ఫైర్ అయ్యారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని వావిలాల, రాజ్య తండా, ఆలేరు, బంజర, మునిగలవీడు, మదనతుర్తి, రావిరాల, నెల్లికుదురు గ్రామాల్లో ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ యాత్రలో వివేక్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, నిరు ద్యోగ భృతి, అందరికీ పింఛన్ల వంటి అన్ని విషయాల్లోనూ కేసీఆర్ మోసం చేశారన్నారు. సీఎం ఫ్యామిలీలో మాత్రం ఐదుగురు పదవులు పొందారని, వారంతా నెలకు రూ.25లక్షల జనం సొమ్మును జీతాలుగా తీసుకుంటున్నారన్నారు.  

కమీషన్ల కోసమే కాళేశ్వరం 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కడా పంటలు పండటం లేదని వివేక్ అన్నారు. కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును కట్టి లక్ష కోట్లు దండుకున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ కింద అనేక చోట్ల పాత వాటర్ ట్యాంకులకే రంగులు పూసి కోట్ల రూపాయలు కాజేశారన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు కట్టిందని, రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ముందుకు సాగడంలేదన్నారు. కమీషన్ల కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారం నుంచి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అవడంతో ఉద్యోగులకు సైతం సక్రమంగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ చార్జీలు, బస్ చార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు.  

కేసీఆర్ కు జనం బుద్ధిచెప్పాలె 

అవినీతి సొమ్ముతో ఓట్లు కొని ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని, ప్రజలు వాస్తవాలను గమనించి ఆయనకు బుద్ధి చెప్పాలని వివేక్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ కేసీఆర్ మాటలను జనం నమ్మలేదని, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలోనూ అవే ఫలితాలు వస్తాయన్నారు. భరోసా యాత్ర సందర్భంగా ఆలేరు గ్రామంలో టీఆర్ఎస్​కు చెందిన పలువురు బీజేపీలో చేరారు. జోరుగా వర్షం కురుస్తున్నా యువత బైక్ ర్యాలీ, మహిళల మంగళహారతుల స్వాగతంతో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. శాసించే వాళ్లను కాదని, సేవకుడిగా పనిచేసేవాళ్లకు రాజకీయ అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎడ్ల అశోక్ రెడ్డి, వద్దిరాజు రామచంద్ర రావు, పల్లె కుమార్, పెదగాని సోమయ్య, పరుపాటి రాంమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఎస్టీ రిజర్వేషన్.. మరో మోసం 

ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే గిరిజన రిజర్వేషన్ అంటూ మరో మోసానికి కేసీఆర్ రెడీ అయ్యారని వివేక్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబసభ్యుల హస్తం ఉందని, దోషులకు శిక్ష పడడం ఖాయమన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలవడం కోసమే ఈ డ్రామా ఆడుతున్నారని, కానీ ఎన్ని గారడీ మాటలు చెప్పినా, టక్కుటమార విద్యలు ప్రదర్శించినా ఆయనను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ కుటుంబం విచ్చలవిడి అవినీతి పాలన, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ కారణంగానే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు.