నిర్మల్ టౌన్ న్యూ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలె : వివేక్ వెంకటస్వామి

నిర్మల్ టౌన్  న్యూ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలె : వివేక్ వెంకటస్వామి

నిర్మల్ టౌన్  న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగుతోంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంఘీభావం ప్రకటించారు. 

మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి, ‌అక్రమాలకు పాల్పడుతున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేసే ఆలోచనతో ముందే మంత్రి కుటుంబ సభ్యులు భూములు కొనుగోలు చేశారని చెప్పారు. గ్రీన్ జోన్ మార్పుపై నేషనల్ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తే.. త్వరగా జీవోపై స్టే వస్తుందన్నారు. 

నిర్మల్ నూతన మాస్టర్ ప్లాన్ 220 జీవోను తక్షణమే రద్దు చేయాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన బంధువులతో భూదందా చేస్తున్నారని ఆరోపించారు. ఏలేటి ఆమరణ నిరాహర దీక్షకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పూర్తి మద్దతుగా ఉందన్నారు. రైతుల కోసం దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి చివరి వరకు మద్దతు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మరోవైపు.. గంట గంటకు మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.