అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఇన్కమ్​ ట్యాక్స్కి మినహాయింపు : వివేక్ వెంకటస్వామి

అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఇన్కమ్​ ట్యాక్స్కి మినహాయింపు : వివేక్ వెంకటస్వామి

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. సింగరేణి కార్మికులు చేసిన ఉద్యమం అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి వెళ్లిందని గుర్తు చేశారు. 1995లో సింగరేణి అప్పుల్లో కూరుకుపోయినప్పుడు ఎన్టీపీసీ నుండి రూ.400 కోట్లు ఇప్పించి.. లక్ష మంది కార్మికుల జీవితాలను తమ తండ్రి కాక వెంకటస్వామి కాపాడారని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా రెండు లక్షల వరకు ఇన్కమ్​ ట్యాక్స్కి మినహాయింపు ఇప్పించానని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు సంస్థ ద్వారా ఇన్కమ్​ ట్యాక్స్కి మినహాయింపు ఇప్పిస్తామని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. కోల్ ఇండియాలో ఉన్నట్టు సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కూడా జీతాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్మికులకు రెండు గుంటల భూమి ఇస్తామన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి లేదని, ఈ విషయంలో ఎవరూ అపోహ చెందవద్దని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే సంస్థలో ఎక్కువ వాటా ఉందని చెప్పారు. సింగరేణి కార్మికులు బీజేపీకి ఓట్లువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఆర్కే 5 గనిపై బీఎమ్ఎస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్​ కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, బీఎమ్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేష్​ హాజరయ్యారు.